Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడులను శుభ్రం చేసిన ఉపాధ్యాయులు
- తొలిరోజు విద్యార్థుల హాజరు అంతంతే
- రాష్ట్రవ్యాప్తంగా బడులు పున:ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని పాఠశాలలు 2022-23 విద్యాసంవత్సరంలో సోమవారం పున:ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలలకు విద్యార్థులు హాజరయ్యారు. అయితే మొదటి రోజు కావడంతో విద్యార్థుల హాజరు తక్కువగానే ఉందని అధికారులు చెప్తున్నారు. రోజురోజుకూ హాజరుశాతం మెరగవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత విద్యాసంవత్సరం సోమవారం నుంచి ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో 2020-21, 2021-22 విద్యాసంవత్సరాల్లో జూన్లో పాఠశాలలు పున:ప్రారంభం కాని విషయం తెలిసిందే. రెండేండ్ల తర్వాత సకాలంలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలు తెరుచుకోవడం గమనార్హం. అయితే సర్కారు బడుల్లో సమస్యలు తిష్టవేశాయి. 49 రోజుల వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తెరవడంతో తరగతి గదులు, ఆవరణ మొత్తం దుమ్ము, ధూళితోపాటు చెట్లు మొలిశాయి. పాఠశాలల కోసం ప్రత్యేకంగా పారిశుధ్య కార్మికులను ప్రభుత్వం నియమించలేదు. గ్రామపంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్లలో పనిచేసే పారిశుధ్య కార్మికుల సేవలను వినియోగించుకోవాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. వారెవరూ పాఠశాలలకు రాలేదు. దీంతో ఉపాధ్యాయులే పారిశుధ్యం పనులు నిర్వహించారు. తరగతి గదులు, ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికులను కేటాయించాలని ఉపాధ్యాయ సంఘాల కోరుతున్నాయి. ఇంకోవైపు ఈనెల మూడు నుంచి ప్రారంభమైన జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభమై విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఉపాధ్యాయులు బడులకు వెళ్లకుండా విద్యార్థుల నివాస ప్రాంతాలకు వెళ్లి పాఠశాలల్లో కొత్త వారిని చేర్పించడం, ఇప్పటికే నమోదైన విద్యార్థులను బడులకు వచ్చేందుకు సన్నద్ధం చేశారు. బడిబాట కార్యక్రమంలో సోమవారం 8,937 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో ప్రవేశం పొందారని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఒక ప్రకటనలో ప్రకటించారు. ఇందులో అంగన్వాడీ కేంద్రాల నుంచి 4,829 మంది, ప్రయివేటు స్కూళ్ల నుంచి 440 మంది, నేరుగా చేరిన వారు 1,221 మంది కలిపి మొత్తం 6,490 మంది చేరారని వివరించారు. ఇప్పటి వరకు సర్కారు బడుల్లో 79,635 మంది విద్యార్థులు ప్రవేశం పొందారని తెలిపారు.