Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ కోసం రూపొందించిన జాబితాను ప్రభుత్వానికి పంపడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ మంగళవారం హైదరాబాద్‌లోని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆవేదన సభ జరగనుంది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) రాష్ట్ర కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, సమన్వయకర్త ఎం జంగయ్య సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణ కోసం జీవో నెంబర్ 16 జారీ చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆర్థిక శాఖ, ఉన్నత విద్యాశాఖ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసే కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ జాబితా ఇవ్వాలంటూ మార్చిలో ఇంటర్ విద్యా కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశాయని తెలిపారు. జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారుల (డీఐఈవో) ద్వారా కాంట్రాక్టు అధ్యాపకుల జాబితాను కళాశాలల వారీగా కార్యాలయానికి తెప్పించుకున్నారని వివరిం చారు. కానీ 100 రోజులకు పైగా అవుతున్నా ఆ జాబితాను సచివాలయానికి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించకపోవడంతో సరైంది కాదని పేర్కొన్నారు. దీంతో కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాలు తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నాయని తెలిపారు.