Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలమల్లేష్, జీవీఆర్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసుకుని బాధితులకు న్యాయం చేయాలి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ బాలమల్లేష్, కార్యదర్శి గోగుల వెంకటేశ్వరరావు (జీవీఆర్) డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఆ సంఘం ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది రూ.500 కోట్లు అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేశారని వివరించారు. డిపాజిట్ దారులు రూపాయి రూపాయి జమచేసి డిపాజిట్ చేసిన సొమ్మును వారికి ఇవ్వకుండా సంస్థను మూసేసి మోసం చేయడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంస్థకు రూ.వెయ్యి కోట్లకుపైగా ఆస్తులున్నాయని వివరించారు. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని డిపాజిటర్లకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో రూ.11 వేల కోట్లు కేటాయించి, ఎనిమిది లక్షల మంది బాధితులను ఆదుకున్నదని గుర్తు చేశారు. చనిపోయిన 500 మంది ఏజెంట్లకు ఒక్కొక్కరికీ రూ.ఐదు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చారని చెప్పారు. అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని సూచించారు.
మంత్రి హరీశ్‌రావుకు వినతి
అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసి బాధితులకు డబ్బులు చెల్లించాలనీ, చనిపోయిన బాధితులకు రూ.ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరుతూ మంత్రి టి హరీశ్‌రావును అగ్రిగోల్డ్ బాధితులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు ఎన్ బాలమల్లేష్, కార్యదర్శి జీవీఆర్, కోశాధికారి మద్దినేని రామారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నల్లబోలు సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.