Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణ జరిపిన హైకోర్టు
- ఏపీ, కేంద్రానికి నోటీసులు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.4,774 కోట్ల మేరకు విద్యుత్ బకాయిలు చెల్లించేలా ఉత్తర్వులివ్వాలని తెలంగాణ దాఖలు చేసిన రిట్లో కేంద్రంతోపాటు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 31 వరకు అసలు రూ.2,698 కోట్లు, వడ్డీ రూ.2,076 కోట్లు కలిపి మొత్తంగా రూ.4,774 కోట్లు ఏపీ బాకీ ఉన్నట్టు తెలంగాణ అఫిడవిట్లో పేర్కొంది. ఎంప్లాయిస్ ట్రస్ట్ నిధులు, ఎఫ్ఆర్పీ బాండ్లు, టీఎస్జెన్కో అధికంగా కట్టిన రుణాల మొత్తాన్ని, ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్) ఈక్విటీలో పెట్టుబడులను తమకు చెల్లించలేదంటూ తెలంగాణ రిట్ వేసింది. ఉద్యోగుల విభజన కాలేదంటూ ఒక సాకుగా చూపించి ఏపీ ఏకపక్షంగా ఏపీ విభజన నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తోందని చెప్పింది. ఈ వ్యవహారంపై హైకోర్టు తుది ఆదేశాలు ఇచ్చే వరకు కేంద్రం జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరింది. రెండు రాష్ట్రాల జనాభా ప్రకారం విద్యుత్ సరఫరా చేయాలన్న నిబంధనను ఉల్లంఘించిందని తెలిపింది. ప్రతివాదులుగా ఉన్న ఎంప్లాయిస్ ట్రస్ట్ నిధులు, ఎఫ్ఆర్పీ బాండ్లు, టీఎస్ జెన్కో అధికంగా కట్టిన రుణాల మొత్తాన్ని, ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్)లతోపాటు కేంద్రానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. విచారణను నెల రోజులకు వాయిదా వేసింది.
జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరు
కోర్టు ధిక్కరణ కేసులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ లోకేశ్‌కుమార్ సోమవారం హైకోర్టు విచారణకు హాజరయ్యారు. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌కు చెందిన మహమ్మద్ ఖాజమ్ అలీ వేసిన కోర్టు ధిక్కరణ రిట్‌ను చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి డివిజన్ బెంచ్ విచారించింది. నాగాహిల్స్‌లోని అలీకి చెందిన స్థలంలో జీహెచ్ఎంసీ రోడ్డు వేసింది. దీనికి పరిహారంగా రూ.1.64 కోట్లు చెల్లించాలని జీహెచ్ఎంసీని గతంలో కోర్టు ఆదేశించింది. ఆ డబ్బును వేరే భూపరిహారంతో కలిపి జీహెచ్ఎంసీ డిపాజిట్ చేసిందనీ, ఇప్పుడు అది ప్రభుత్వ స్థలమని చెబుతోందని పిటిషనర్ వాదన. ప్రభుత్వ స్థలం కాబట్టి పరిహారం ఇవ్వక్కర్లేదని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వానిదే స్థలమైతే భూసేకరణ నోటిఫికేషన్ ఎలా ఇచ్చారని హైకోర్టు నిలదీసింది. స్థలంపై హక్కుల పత్రాలు చూపాలని పిటిషనర్‌ను ఆదేశించి తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
పరిహార చెల్లింపులకు ఆస్కారం ఎంతో చెప్పండి
సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది బిహారీలు మరణించిన ఘటనపై దాఖలైన పిల్‌ను హైకోర్టు విచారణ జరిపింది. చీఫ్ సెక్రటరీ, లేబర్ డిపార్ట్మెంట్ పిన్సిపల్ సెక్రటరీ, లేబర్ కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లకు సోమవారం చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి డివిజన్ బెంచ్ నోటీసులు ఇచ్చింది. అగ్నిప్రమాద ఘటనపై జ్యుడిషియల్ కమిటీ వేసి దర్యాప్తునకు ఆదేశించాలని వాచ్వాయిస్ ఆఫ్ ది పీపుల్ అనే ఎన్జీవో పిల్ వేసింది. వలస కార్మిక చట్టాల ప్రకారం మృతుల కుటుంబాలను ఏ మేరకు ఆదుకునేందుకు వీలుందో ప్రతివాదులు తమ కౌంటర్ పిటిషన్లో వివరించాలని ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.