Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అజ్యూర్ పవర్ గ్లోబల్ సంస్థకు అనుమతి పత్రాలు ఇచ్చిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సోలార్ విద్యుదుత్పత్తి పరికరాల తయారీకి సంబంధించి రాష్ట్రంలో రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన అజ్యూర్ పవర్ గ్లోబల్ సంస్థ ముందుకొచ్చింది. దీనికి అవసరమైన అనుమతి పత్రాలను సోమవారం పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఆ కంపెనీ ప్రతినిధులకు అందచేశారు. ప్రీమియర్ ఎనర్జీ గ్రూప్‌తో కలిసి ఈ సంస్థ రాష్ట్రంలో పనిచేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 2.5 గిగావాట్ల సోలార్ సెల్, సోలార్ మాడ్యుల్స్ తయారీ ప్లాంట్లను ఇక్కడ ఏర్పాటు చేస్తారని మంత్రి చెప్పారు. దీనివల్ల దాదాపు మూడువేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లోని ఈ-సిటీలో ఈ సంస్థ నూతన ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది. ఈ సందర్భంగా అజ్యూర్ పవర్ గ్లోబల్ చైర్మెన్ అలన్ రోస్లింగ్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్లాంట్లను రాష్ట్రంలో నెలకొల్పుతున్నట్టు వివరించారు. ప్రీమియర్ ఎనర్జీ చైర్మెన్ సురేందర్ పాల్ సింగ్, మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవి సలుజ తదితరులు పాల్గొన్నారు.