Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుబాటులో 32 లక్షల వ్యాక్సిన్ డోసులు
- గడువు తీరిపోయే ప్రమాదం : కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ అధ్వర్యంలో అర్హులైన వారందరికీ ప్రికాషనరీ డోస్ ఇవ్వడానికి అనుమతివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని కోరారు. 'నిక్షరు మిత్ర క్యాంపెయిన్', 'రాష్ట్రీయ నేత్ర జ్యోతి అభియాన్', 'హర్ ఘర్ దస్త్రక్ క్యాంపెయిన్ -2.0'పై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మనుసుక్ మాండవీయ సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్యారోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం నుంచి హరీశ్‌రావు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వద్ద 32 లక్షల వాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయనీ, వాటి గడువు తేదీ ముగిసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతిస్తే ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు వ్యాక్సిన్ సద్వినియోగం అవుతుందనీ, కొత్త వేరియంట్ల రూపంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తిని అరికట్టగలుగుతామని సూచించారు. ప్రభుత్వ వైద్యంలో ప్రస్తుతం 60 ఏండ్లు దాటిన వారికి మాత్రమే ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతించింది. 18 ఏండ్లు పైబడిన వారికి ఏప్రిల్ 10 నుంచి ప్రయివేటు ఆస్పత్రుల్లోనే ప్రికాషనరీ డోసు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హరీశ్ రావు అందరికి ప్రభుత్వాస్పత్రుల్లో వేసేందుకు అనుమతించాలంటూ గతంలో రెండు సార్లు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో వ్యాక్సినేషన్, టీబీ నిర్మూలనా తదితర కార్యక్రమాలను కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.