Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే సాగు ప్రణాళిక ప్రకటించండి
- నకిలీ విత్తనాలను అరికట్టాలి
- కౌలుచట్టం-2011 అమలు చేయాలి
- రైతు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు
నవతెలంగాణ- విలేకరులు
''వానాకాలం సీజన్ ప్రారంభమైనా రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి రాలేదు.. ఇప్పటి వరకు సరైన వ్యవసాయ ప్రణాళిక రూపొందించలేదు.. ప్రభుత్వం వెంటనే నకిలీ విత్తనాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలి.. విత్తనాలు, ఎరువులు సరిపడా రైతులకు అందుబాటులో ఉంచాలి.. సాగు రుణాలు అందించాలి'' అని రైతు, కౌలు రైతు సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలపై సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు.
రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌శోభన్ నాయక్ ఆధ్వర్యంలో మేడ్చల్ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవసాయ రుణాలు అందజేయాలని కోరారు. సీజన్ ప్రారంభమైనప్పటికీ, కొన్నిచోట్ల మెట్ట పంటలు వేసినా ఇంకా పభుత్వం వ్యవసాయ ప్రణాళిక విడుదల చేయలేదన్నారు. కొందరు కల్తీ విత్తనాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, పాలకూర నుంచి పత్తి విత్తనాల వరకూ 'నకిలీ'తో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టాలని, నాణ్యమైన విత్తనాలను మార్కెట్ కమిటీలు, ప్రభుత్వ సంస్థల ద్వారా రైతులకు అందించాలని కోరారు. రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. రైతులకు ఎరువు సబ్సిడీ, కౌలు రైతులకు 2011 చట్టప్రకారం రుణ అర్హత కార్డులు ఇవ్వాలని కోరారు. రైతు బీమా పథకాన్ని 18-75 సంవత్సరాలకు పెంచి ఈ ఆగస్టు నుంచి ప్రభుత్వం ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఎక్కల దేవి కొమురయ్య, కాయిత నర్సింగ్‌రావు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
2011 కౌలు చట్టం అమలు చేయాలని తెలంగాణ కౌలురైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరేపల్లి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌలు చట్టం అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, రైతుబంధు డబ్బులు వెంటనే ఖాతాల్లో జమ చేయాలని కోరారు.
సూర్యాపేట జిల్లా మునగాలలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ గుగులోత్ కృష్ణానాయక్‌కు వినతిప త్రం అందజేశారు. నల్లగొండ జిల్లా మునుగోడు, యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా అనంతరం వినతిపత్రం అందజేశారు. రైతులకు విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచాలని, నకిలీ విత్తనాలు అమ్మె వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.