Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ల ముందు మత్స్యకారుల ధర్నా
నవతెలంగాణ విలేకరులు-హైదరాబాద్
ఈ ఏడాది ఉచిత చేపపిల్లల టెండర్లద్వారా కాకుండా మత్స్యసొసైటీ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని, 50 సంవత్సరాలు దాటిన మత్స్యకారుడికి రూ.5 వేల వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని, ఎన్సీడీసీ ద్వారా 2వ విడతగా మత్స్యకారులకు వివిధ సంక్షేమ పథకాలు అందజేయాలని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు వందలాది మంది మత్స్యకారులు ఆందోళనలు నిర్వహించారు. తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రంగారెడ్డి, హైదరాబాద్, జనగాం, అసిఫాబాద్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి యాదాద్రి జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించి వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించి మత్స్యకారులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృత చేస్తామని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గోరింకల నర్సింహ్మ, లెల్లెల బాలకష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కుటుంబ పెద్దదిక్కు కోల్పోయి అనేక ఇబ్బందుల్లో వున్న మత్స్యకార కుటుంబాలకు పెండింగ్లో వున్న ఇన్స్యూరెన్సు, ఎక్స్ గ్రేషియోలు వెంటనే అందించాలన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చెనమోని శంకర్, గోరింకల నర్సింహ్మ, హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పూస నాగమణి, ముఠా విజయకుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు గాండ్ల అమరావతి, ముఠా దశరథ్, భువనగిరి యాదాద్రి జిల్లాలో నాయకులు పి. సత్యనారాయణ, అసిఫాబాద్ జిల్లాలో అధ్యక్ష, కార్యదర్శులు హుడే భీంరావ్, దివిటి మోరేశ్వర్, జనగామ్లలో అధ్యక్ష, కార్యదర్శులు పంపర మల్లేశం, మునిగెల రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు రావుల రాజు, ఖమ్మంలో ప్రధాన కార్యదర్శి పగడాల నాగేశ్వరరావు, నల్లగొండలో అధ్యక్ష, కార్యదర్శులు గాలి నర్సింహ్మ, మురారి మోహన్, సూర్యాపేటలో అధ్యక్ష, కార్యదర్శులు శీలం శ్రీను, నాయకులు పిట్టల నాగేశ్వరరావు, హుస్సేన్ తదితరులు నాయకత్వం వహించారు.