Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగులకు భృతి ఇవ్వాలి
- కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ - ఆత్మకూరు
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఐక్య వేదిక వారంపాటు పర్యటించి ప్రజల సమస్యలపై అధ్యయనం చేసిందని చెప్పారు. వాటిలో ప్రధానంగా పింఛన్, డబుల్ బెడ్రూం ఇండ్లు, రేషన్ కార్డు, చాలా గ్రామాల్లో దళితులకు శ్మశాన వాటికలు లేకపోవడాన్ని గుర్తించినట్టు చెప్పారు. ప్రత్యేకించి గుంటిపల్లి, మోట్లంపల్లి గ్రామాల్లో విద్యుత్, రహదారి సమస్యలున్నాయన్నారు. ప్రతి గ్రామంలో ఉపాధి కూలీలకు నేటికీ డబ్బులు చెల్లించని పరిస్థితి ఉందన్నారు. మండల కేంద్రంలో 2008లో సర్వే నెంబర్ 281/2, 228/2లో పేదలకు ఇండ్ల స్థలాలిచ్చారన్నారు. కానీ వాటికి ఎలాంటి హద్దులు చూపించలేదని తెలిపారు. భూములకు హద్దులు చూపించాలని, ఉపాధి కూలీల పెండింగ్ డబ్బులు చెల్లించాలని, 200 పని దినాలు కల్పించి రోజుకు రూ.600 కూలి చెల్లించాలని కోరారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగులకు రూ.3,016 నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలను సమీకరించి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ.జబ్బార్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జీఎస్.గోపి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీహరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్.రాజు, రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్, నాయకులు అజరు, శ్యామసుందర్ పాల్గొన్నారు.