Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు భరోసా కల్పిస్తాం
- ప్రయివేటు బడుల నుంచి వలసలు పెరిగాయి
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- మహబూబియా పాఠశాల సందర్శన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం ద్వారా కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం సీఎం కేసీఆర్ సంకల్పమని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరంలో సోమవారం నుంచి పాఠశాలలు పున:ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి హైదరాబాద్‌లోని మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. 'మన ఊరు-మనబడి' కార్యక్రమంలో చేపట్టిన పనులను పరిశీలించారు. పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశమై ముచ్చటించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు పెట్టే ప్రతిపైసాను భావితరాల బాగుకోసం పెట్టే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తున్నదని అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యా ప్రమాణాలను నెలకొల్పుతున్నామని చెప్పారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు ప్రభుత్వం భరోసా ఇస్తుందన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారంతో కూడిన భోజనంతోపాటు భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎదగాలని ప్రభుత్వం భావిస్తున్నదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడంతోపాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతుండడంతో ప్రయివేటు విద్యాసంస్థల నుంచి సర్కారు బడులకు వలసలు పెరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో 75 వేల మందికిపైగ విద్యార్థులు ప్రవేశాలు పొందారని వివరించారు. వాటిపై తల్లిదండ్రులకు భరోసా కల్పించేలా ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న రెండేండ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో అన్ని హంగులతో మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. భవిష్యత్తులో వాటిలో చదువుకోవడం గొప్ప వరంగా మారే అవకాశముదని మంత్రి ఆకాంక్షించారు.