Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాతంత్య్రం కోసం యావదాస్తిని ఇచ్చిన రాహుల్ గాంధీ కుటుంబం
- ఈడీ బెదిరింపులకు భయపడేది లేదు : కాంగ్రెస్ నిరసన ర్యాలీలో రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని అడ్డుపెట్టుకుని కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాహుల్ గాంధీ కుటుంబాన్ని బెదిరింపజూస్తోందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఇలాంటి బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ భయపడబోదని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఈడీ కార్యాలయం ముందు దాదాపు నాలుగు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశ స్వాతంత్య్రం కోసం చేసిన త్యాగాలు, బీజేపీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బ్యానర్లు, ప్లకార్డులతో ర్యాలీ కొనసాగింది. ఇందిరాగాంధీ విగ్రహం నుంచి పాత సచివాలయం, ఆదర్శ్‌నగర్ మీదుగా ఈడీ కార్యాలయానికి ప్రదర్శన చేరుకుంది. ఈడీ స్వతంత్ర సంస్థగా కాకుండా అధికార పార్టీ తొత్తుగా మారి ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించారు. వేలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల రాకతో గన్ పార్కు నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వెళ్లే రహదారి నిండిపోయింది. కాంగ్రెస్ పార్టీ జెండాలు, నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది.
ఆ అవసరం గాంధీ కుటుంబానికి లేదు :రవంత్ రెడ్డి
ర్యాలీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి చేయాల్సిన అవసరం రాహుల్ గాంధీ కుటుంబానికి లేదని తెలిపారు. రాహుల్ పిలుపిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు 24 గంటల్లో రూ.ఐదు వేల కోట్లు సేకరిస్తారని స్పష్టం చేశారు. దేశ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ గొంతుక వినిపించేందుకు పుట్టిన నేషనల్ హెరాల్ట్ పత్రిక అప్పుల్లో కూరుకుపోతే తిరిగి నడపడానికి రాహుల్ నడుం బిగించారని చెప్పారు. ఆ పత్రిక బీజేపీ అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తుంటే అందులో అక్రమాలు జరిగాయని ఈడీ నోటీసులిచ్చిందని తెలిపారు. 2015లోనే నేషనల్ హెరాల్డ్ కేసులో అలాంటిదేమి జరగలేదని అదే సంస్థ నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత మోడీ సర్కార్ ఈ కేసును తిరిగి తెరిచిందని వివరించారు. బీజేపీ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారనీ, ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే భయంతోనే ఈడీ నోటీసులిచ్చారని విమర్శించారు. గాంధీ కుటుంబంపై ఈగ వాలినా ఊరుకునేది లేదనీ, సోనియాగాంధీని ఈడీ కార్యాలయానికి రప్పిస్తే చెయ్యి నరికేస్తామని హెచ్చరించారు.
బీజేపీని తరిమికొడతాం...భట్టి
దేశం నుంచి బీజేపీని తరిమికొడతామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. గతంలో ఇందిరాగాంధీని జైలుకు పంపిస్తే ఏమి జరిగిందో తెలుసుకోవాలని బీజేపీకి సూచించారు. రాహుల్, సోనియా ఈడీ నోటీసులకు భయపడే వ్యక్తులు కాదని స్పష్టం చేశారు. వారిని కాపాడుకుంటామన్నారు. తమ పోరాటానికి ఇది ఆరంభం మాత్రమేననీ, మున్ముందు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈస్ట్ ఇండియా కంపెనీని తరిమి కొట్టిన పార్టీ ....:శ్రీధర్ బాబు
దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని బీజేపీ మాదిరిగానే నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ బెదిరించేందుకు ప్రయత్నించిందని ఆ పార్టీ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు గుర్తుచేశారు. అయితే ప్రజాబలంతో ఆ కంపెనీని కాంగ్రెస్ పార్టీ తరిమికొట్టి ప్రజలకు స్వేచ్ఛనిచ్చిందని తెలిపారు. అదే స్ఫూర్తితో బీజేపీని గద్దె దించుతామని హెచ్చరించారు. స్వాతంత్ర పోరాటం కోసం యావదాస్తిని ఇచ్చిన గాంధీ కుటుంబానికి అవినీతి చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఈడీతో నోటీసులిప్పించారని విమర్శించారు. బీజేపీ ముక్త భారత్ చేసి తీరుతామని హెచ్చరించారు. నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి గీతారెడ్డి ఆ పార్టీ సీనియర్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్, స్టార్ కంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ నాయకులు బోసురాజు, చిన్నారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, షబ్బీర్ అలీ, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.