Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్య, ఉపాధి కల్పనపై దృష్టిపెట్టట్లేదు
- భగత్‌సింగ్ పాఠ్యాంశం తొలగించడం సరిగాదు
- మత రాజకీయాలతో బీజేపీ పబ్బం
- డిసెంబర్లో తెలంగాణలో ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు : అఖిల భారత అధ్యక్షులు వీపీ సానూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో విద్య, ఉపాధి కల్పన, మహిళా, ఇతర సమస్యలపై దృష్టి పెట్టకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మత రాజకీయాలను తిప్పకొడతామనీ, బుల్డోజర్ బ్యాచ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు వీపీ సానూ చెప్పారు. నూతన విద్యా విధానం పేరుతో విద్యను కాషాయీకరణ చేసే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. విద్యాపరిరక్షణ, ఉపాధి కల్పన కోసం దేశవ్యాప్తంగా పోరాటాలను ఉధృతంగా చేయనున్నట్టు వెల్లడించారు. డిసెంబర్ నెలలో ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు తెలంగాణలో నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లో ఎస్ఎఫ్ఐ ప్లీనం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జెండా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి ఎగురవేశారు. ప్లీనంలో, మీడియాతో సానూ మాట్లాడుతూ..మతం చుట్టూ రాజకీయాలు చేస్తూ సమస్యలను బీజేపీ పక్కదోవ పట్టిస్తున్నదని విమర్శించారు.
అభివృద్ధి చెందుతున్న జాబితాలోని మన దేశం మోడీ సర్కారు విధానాలతో తిరోగమనం దిశగా ప్రయాణిస్తున్నదని చెప్పారు. దేశంలో గడిచిన 50 ఏండ్లలోనే అత్యంత గరిష్టానికి నిరుద్యోగ శాతం చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలో నూతన పోస్టుల సృష్టి జరక్కపోగా ఖాళీల్లోని ఒక్క పోస్టునూ భర్తీ చేయట్లేదని వివరించారు. రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకాలతో ఉన్న ఉపాధి అవకాశాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొందన్నారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు లేకపోవడంతో వెనుకబడిన సామాజిక తరగతుల వాళ్లకు తీరని అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. దేశంలో నిరుద్యోగ గ్రాడ్యుయేట్ల సంఖ్య ఏటేటా పెరిగిపోతున్నదని ఆందోళన వెలిబుచ్చారు. మహిళలకు దేశంలో రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్, యూపీ, కర్నాటక, తదితర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, బెంగాల్లో రాజకీయ లబ్ది కోసం మతం పేరిట నిత్యం ఉద్రిక్త పరిస్థితులను ఆర్ఎస్ఎస్, హిందూత్వ శక్తులు సృష్టిస్తున్నాయని విమర్శించారు. శివలింగాల పేరుతో మోహన్‌భగవత్, బీజేపీ నేతలు, ప్రజాప్రతి నిధులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. రాజకీయ లబ్ది కోసం బీజేపీ చేస్తున్న చేష్టలతో అంతర్జాతీయంగా మన దేశానికి చెడ్డ పేరు వస్తున్నదనీ, అరబ్ దేశాలన్నీ మన దౌత్యకార్యాల యాల వద్ద ఆందోళనలు చేస్తున్న పరిస్థితి నెలకొం దని వివరించారు. కర్నాటకలో జాతీయోద్యమ నాయకులు భగత్‌సింగ్ పాఠ్యాంశాలను తీసేసి స్వాతంత్య్రోమ కాలంలో బ్రిటీష్ పాలకులకు వత్తాసు పలికిన నేతల పాఠ్యాంశాలను జొప్పించడం దుర్మార్గ మన్నారు. స్కార్ప్ కట్టుకోవడం, కొంగుతో కప్పు కోవడం లాంటివి ఒక్క ముస్లిం మహిళలే చేయరనీ, ఉత్తరభారతంలోని మెజార్టీ మహిళలు ఆ పని చేస్తారని తెలిపారు. కర్నాటకలో బురఖా అంశాన్ని హిందూత్వ శక్తులు రాజకీయ లబ్ది కోసం వివాదాస్పదం చేశాయని విమర్శించారు. గాంధీ పుట్టిన గుజరాత్లో ఐదో తరగతి విద్యార్థులకు ఆయన గురించి తెలియకపోవడం శోచనీయమన్నారు. దీనిని బట్టే పాఠ్యపుస్తకాలలో హిందూత్వ భావజాలాన్ని ఎలా జొప్పిస్తున్నారో అర్థం చేసుకోవచ్చునన్నారు. యూజీసీ, జేఎన్‌యూ కీలక భాగాల్లో హిందూత్వ శక్తులు, తమకు అనుకూలంగా ఉండే వారిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియమించుకున్నదని వివరించారు. యూపీలో యోగీ సర్కారు ప్రశ్నించేవారిపై దాడులు చేస్తూ బుల్డోజర్ పేరుతో రాజ్యాంగ, లౌకిక, సాంస్కృతిక విలువలకు తిలోదకాలు ఇస్తున్నదని విమర్శించారు. 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడిన సమయంలో వచ్చే వందేండ్లలో అఖండ భారత్ పేరుతో దేశాన్ని హిందూత్వ రాజ్యంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నదనీ, అందులో భాగమే ఈ చర్యలన్నీ అని తెలిపారు. 1964లో సీపీఐ(ఎం) ఏర్పడినప్పుడు అందులోని పొలిట్‌బ్యూరో సభ్యులంతా జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొని సంవత్సరాల తరబడి జైలు జీవితాన్ని గడిపారనీ, వారు దేశం కోసం పోరాడిన నిజమైన దేశభక్తులు అని తెలిపారు. వారి స్ఫూర్తితో దేశంలో రాజ్యాంగ, లౌకిక విలువలను కాపాడుకునేందుకు దేశభక్తియుత పోరాటాల్లోకి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడుతూ..పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లను రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వకపోవడం సరిగాదన్నారు. రాష్ట్రంలోని 24వేల టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా చదువులు ఎలా చెబుతారని ప్రశ్నించారు. పెంచిన బస్చార్జీలకు వ్యతిరేకంగా విద్యార్థులను కూడగట్టి ప్రభుత్వం దిగొచ్చేదాకా పెద్దఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించారు. ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం చట్టం చేసేలా పోరాడుతామని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం లక్షల కోట్ల రూపాయలను ఖర్చుపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల చదువల కోసం రూ.3 వేల కోట్లు విడుదల చేయకపోవడం దారుణమని విమర్శించారు. గర్ల్స్ కో-కన్వీనర్ మిశ్రీన్ మాట్లాడుతూ..రాష్ట్రంలో రోజురోజుకీ పెరిగిపోతున్న లైంగిక దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. షీటీమ్‌లు షోటీమ్లుగా కాకుండా ఉండొద్దని విజ్ఞప్తి చేశారు. లైంగిక దాడి ఘటనల్లో పొలిటిల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారి పట్ల ఒకలా, రాజకీయ పలుకుబడి లేనివారి పట్ల మరోలా వ్యవహరించడం ఎంత వరకు సబబు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్ఎల్ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గర్ల్స్ కన్వీనర్ పూజ, హెచ్‌సీయూ సంయుక్త కార్యదర్శి శిరీష, రాష్ట్ర ఉపాధ్యక్షులు జావేద్, రవి, శ్రీకాంత్‌వర్మ, రజనీకాంత్, సంతోష్, బషీర్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు శంకర్, వనం రాజు, ప్రశాంత్, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్, అశోక్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.