Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగులో ఉన్న భూములను పట్టాలు ఇవ్వాలి : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
- కొండాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
నవతెలంగాణ-మెదక్ డెస్క్
కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అసైన్డ్ భూములను గుంజుకొని బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ అన్నారు. పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునిదేవునిపల్లి గ్రామంలో రైతులు 80 సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. భూ ప్రక్షాళన పేరుతో రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మునిదేవునిపల్లి గ్రామంలో రైతులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు వెంటనే సర్టిఫికెట్లు ఇచ్చి ధరణిలో నమోదు చేయాలన్నారు. లేనిపక్షంలో రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అలాగే, వానాకాలం సాగుకు సంబంధించి విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని కోరారు. ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.నర్సింలు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, ఉపాధ్యక్షులు కె.రాజయ్య, సీఐటీయూ నాయకులు బాబురావు, రైతులు గోపాల్, మాల బాలయ్య, శ్రీనివాస్, ఎస్.ఆంజనేయులు, శివయ్య, మందుల బందయ్య, బేగరి అనంతమ్మ, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.