Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ
- హన్మకొండలో భారీ ధర్నా, చలో కలెక్టరేట్
నవతెలంగాణ-హనుమకొండ
ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్న పేదల వైపో.. భూకబ్జాలకు పాల్పడుతున్న ల్యాండ్ మాఫియా వైపో తేల్చుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. సోమవారం హన్మకొండలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో కలెక్టరేట్‌కు వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలు వేలాది మంది హన్మకొండలోని ఏకశిలా పార్కుకు తరలివచ్చారు. తొలుత స్థానిక రోడ్డుపై బైటాయించి భారీ ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం ఏకశిలా పార్కు నుంచి వరంగల్, హన్మకొండ కలెక్టరేట్ల ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన గుడిసె వాసులు, సీపీఐ నాయకులు, కార్యకర్తలను కాళోజీ సెంటర్‌కు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం నాయకులను కలెక్టర్లకు వినతిపత్రం అందించేందుకు మాత్రమే పోలీసులు అనుమతివ్వడంతో డాక్టర్ కె నారాయణ, తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాలో నారాయణ మాట్లాడుతూ.. వరంగల్ నగరంలో పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామన్న సీఎం కేసీఆర్ తన హామీని నిలబెట్టుకోలేదన్నారు. ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం అవుతుంటే వాటి పరిరక్షణ కోసం నిలువనీడలేని పేదలే ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి వుంటే ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. పేదలు ఉంటే భూములపైనా.. లేదంటే జైళ్లలో ఉండేందుకైనా సిద్ధమని అన్నారు. ఇండ్ల స్థలాలు పేదలకు దక్కే వరకూ ఈ పోరాటాన్ని ఆపేది లేదని చెప్పారు. ధర్నాకు వేలాదిగా తరలి వచ్చిన ప్రజలతో హన్మకొండ బస్టాండ్ నుంచి నక్కలగుట్ట కాళోజీ సెంటర్ వరకు రోడ్డు కిక్కిరిసిపోయింది. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేదునూరి జ్యోతి, హన్మకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు కర్రె బిక్షపతి, మేకల రవి, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ వలీ వుల్లా ఖాద్రి, రాష్ట్ర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.