Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలీనం చేయాలా..? లేక అలాగే ఉంచాలా...?
- కలిపేస్తే అసలు ఉనికే కోల్పోతుందా..?
- అధికార పార్టీలో తర్జన భర్జనలు
- రేపటి ఢిల్లీ సమావేశంపై స్పష్టత కరువు
- హాజరైతేనే మంచిదన్న పీకే
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి సారించాలని భావిస్తున్న తరుణంలో... భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ భావిస్తున్న సంగతి తెలిసిందే. అందుకనుగుణంగా ఆయన సొంత పార్టీ నేతలతోపాటు పలువురు మేధావులు, రాజకీయ నేతలతో చర్చోప చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను ఏం చేయాలనే దానిపై తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. దాన్ని బీఆర్ఎస్లో కలిపేయాలా..? లేక అలాగే కొనసాగించాలా..? అనే దానిపై కేసీఆర్ లోతైన చర్చలు, సమాలోచనలు జరుపుతున్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్లో కలిపేస్తే... అసలు తెలంగాణ సెంటిమెంట్, దాని ప్రత్యేకత పక్కకు పోతాయి కదా..? అనే సందేహం కూడా ఆయన్ను వెంటాడుతున్నది. అలాగాక దాన్ని యధావిధిగా కొనసాగిస్తూ బీఆర్ఎస్ను ఏర్పాటు చేస్తే ఒక జాతీయ పార్టీకి... ప్రాంతీయ, అందునా ఉప ప్రాంతీయ సెంటిమెంట్ ఎలా ఉంటుందనే విధంగా విమర్శలొస్తాయనే భావన కూడా నెలకొంది. ఇటీవల కేసీఆర్... తన సొంత పార్టీలోని ముఖ్యులతో నిర్వహించిన సమావేశంలో పలువురు ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. 'ముందు మనకు రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. ఈ దిశగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకోవాలి...' అని కొందరు ఆయనకు తెలిపినట్టు సమాచారం. 'బీజేపీ రాష్ట్రంలో మరీ రెచ్చిపోతున్నది. దాన్ని కట్టడి చేయాలి. వరంగల్ డిక్లరేషన్ తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఈ విషయాలు మీరు పరిగణనలోకి తీసుకుని... ఇక్కడి పరిస్థితులపై సీరియస్గా దృష్టి సారించాలి...' అని వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు వినికిడి. మరోవైపు కేసీఆర్ చెబుతున్న బీఆర్ఎస్పై ఆయన మంత్రివర్గ సహచరులు, సీనియర్ ఎమ్మెల్యేలు సైతం అంతగా ఆసక్తి కనబరచటం లేదనే వాదన బలంగా వినబడుతున్నది. బీఆర్ఎస్ గురించి వివిధ బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ ప్రస్తావించినప్పుడల్లా జనం కేరింతలు కొడుతున్నప్పటికీ టీఆర్ఎస్ క్యాడర్ దృష్టి మాత్రం అటువైపు లేనట్టే కనబడుతున్నది. ఇదే సమయంలో తమ నాయకుడు... బీఆర్ఎస్ను ఏర్పాటు చేయటం ఖాయమని కొందరు కీలక నేతలు చెబుతున్నారు. ఆ పార్టీ జెండా కూడా గులాబీ కలర్లోనే ఉంటుందనీ, దానికి కూడా కారు గుర్తే ఉంటుందని వారు తెలపటం గమనార్హం. కాకపోతే ఇప్పుడు జెండాపై ఉన్న తెలంగాణ పటం స్థానంలో రేపు భారతదేశ పటం ఉంటుందనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. వీటన్నింటిపై స్పష్టత రావాలంటే ఈనెల 19న నిర్వహించే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వరకూ వేచి చూడాల్సిందేనని ఒక నేత వ్యాఖ్యానించారు. దీంతోపాటు రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలో నిర్వహించబోయే సమావేశానికి టీఆర్ఎస్ తరపున హాజరవుతారా..? లేదా..? అనే దానిపై ఇప్పటి వరకూ ఆ పార్టీ వైపు నుంచి స్పష్టత రాకపోవటం గమనార్హం. కాకపోతే ఆ భేటికి కాంగ్రెస్ హాజరైతే తాము వెళ్లకూడదనే రీతిలో సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమావేశానికి హాజరైతేనే మంచిదంటూ ఇటీవల కేసీఆర్తో భేటీ అయిన ప్రశాంత్ కిశోర్ సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి మంగళవారం మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.