Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓవైపు నకిలీల బెడద.. మరోవైపు కృత్రిమ కొరత
- బ్లాక్మార్కెట్లో డిమాండ్ కంపెనీల సీడ్స్ ొ ఒక్కో ప్యాకెట్‌పై రూ.500 వరకూ అదనపు వసూళ్లు
- మిర్చి, పత్తి విత్తనాల్లో మొదలైన మోసాలు ొ సీడ్స్ దుకాణాల వద్ద పెరిగిన రైతుల రద్దీ
ఆరుగాలం కష్టపడే అన్నదాతకు కన్నీండ్లే మిగులుతున్నాయి. భూమినే నమ్ముకుంటే..పెరిగిన పెట్టుబడులకు తోడు కల్తీవిత్తనాలు రైతును కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. నాణ్యత లేని విత్తనాలు అమ్మే వారిపై కఠినచర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా అమలు కావటం లేదని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వ్యవసాయశాఖ, పోలీసులు లంచాలకు మరిగి చూసీ చూడనట్టుగా ఉండిపోతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నకిలీ విత్తన విక్రయదారులు యథేచ్ఛగా తరలిస్తున్నారు. దీంతో అన్నదాత నిట్టనిలువున మునిగిపోతున్నాడు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
విత్తు.. విపత్తులో ఉంది. ఓ వైపు నకిలీలు, మరోవైపు కృత్రిమ కొరత రైతులను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా డిమాండ్ బాగా ఉన్న కంపెనీల మిర్చి విత్తనాలను డీలర్లు బ్లాక్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు నిషేధిత కంపెనీల బీటీ-3 పత్తి విత్తనాలు ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలంలో గత నెల పట్టుబడ్డాయి. 40 నిషేధిత పత్తి విత్తన ప్యాకెట్లను సీజ్ చేశారు. వ్యవసాయశాఖ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉమ్మడిగా దాడులు నిర్వహిస్తున్నా విత్తన నకి'లీలలు' మాత్రం ఆగడం లేదు. నకిలీ విత్తన విక్రేతలపై కేసులు నమోదవుతున్నా సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. నిందితులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలని ఆదేశాలున్నా నామమాత్రపు కేసులతో సరిపెడుతున్నారని రైతుసంఘాలంటున్నాయి. గతేడాది ఖమ్మం జిల్లాలో 14 చోట్ల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. 396 ప్యాకెట్ల పత్తి విత్తనాలను సీజ్ చేశారు. ఈ కేసుల్లో ఎవరికీ శిక్ష పడకపోవడంతోనే నకిలీగాళ్లు రెచ్చిపోతున్నారనే విమర్శలున్నాయి.
బ్లాక్ మార్కెట్లో మిర్చి విత్తనం
డిమాండ్ బాగా ఉన్న కంపెనీల మిర్చి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు చేరుతున్నాయి. విత్తన డీలర్లు కృత్రిక కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల నేలస్వభావాన్ని బట్టి కొన్ని మిర్చి విత్తన కంపెనీల దిగుబడి బాగా వస్తుంది. చీడపీడలను తట్టుకోవడంలో మేటిగా ఉన్న కంపెనీలపై రైతులు వ్యామోహం చూపుతారు. గతేడాది తామరనల్లి తీవ్రతతో మిర్చి దిగుబడి సగానికి పడిపోయింది. ఖమ్మం జిల్లాలో 1.03 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు చేయగా ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి చొప్పున రావాల్సి ఉంది. కానీ తామర నల్లి ప్రభావంతో ఎకరానికి 10 క్వింటాళ్లలోపే దిగుబడి వచ్చింది. కొందరు రైతులు ఏకంగా మిర్చి తోటలను తొలగించారు. అయితే ఒకటి, రెండు కంపెనీల మిర్చి రకాలు మాత్రం 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడినిచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదనుగా ఆ కంపెనీ విత్తనాలను డీలర్లు బ్లాక్ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఖమ్మం మార్కెట్లో నాణ్యమైన విత్తనాలు లభిస్తాయనే నమ్మకంతో చుట్టుపక్కల జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట తదితర ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడికి వస్తారు. అలా వచ్చిన రైతుల్లో ఎక్కువ మంది ఎరువులు, క్రిమిసంహారక మందులు స్థానికంగా కొనుగోలు చేస్తుంటారు. కొందరు మాత్రం ఎక్కడ విత్తనాలు కొన్నారో.. అక్కడే ఎరువులు, క్రిమిసంహారక మందులు కూడా కొనుగోలు చేస్తారు. అటువంటి రైతులు మినహా మిగిలిన వారు డిమాండ్ ఉన్న కంపెనీ విత్తనాలడిగితే డీలర్లు రకరకాల కొర్రీలు పెడుతున్నారని బాధితులు వాపోతున్నారు. మండల వ్యవసాయాధికారి జారీ చేసిన కూపన్లు చూపుతేనే మిర్చి విత్తనాలు ఇస్తున్నారు. కూపన్లు లేని రైతులు గత్యంతరం లేక 10 గ్రాముల విత్తన ప్యాకెట్‌కు రూ.500 వరకూ అధికంగా వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మిర్చిలో బాగా డిమాండ్ ఉన్న ఓ కంపెనీ ప్యాకెట్ (10 గ్రాములు) వాస్తవ ధర రూ.710 కాగా దాన్ని బ్లాక్మార్కెట్లో రూ.950 నుంచి రూ.1,200 వరకూ విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
నేనొకటి అడిగితే వాళ్లకటి ఇస్తమంటే వద్దని అచ్చిన..
- తేజావత్ సంతు, పుఠానితండా, రఘునాథపాలెం
పొయినేడు రెండు ఎకరాల మిర్చి తోట వేసిన. తామర నల్లి తాకిడికి పంట మొత్తం పోయింది. రూ.2 లక్షల దాక నష్టమొచ్చింది. ఈ ఏడాది అర ఎకరం వేద్దామన్నా ధైర్యం చాలట్లే. ఎట్టయితే అట్టయింది అని అర ఎకరానికి నారు పోద్దామని మిర్చి విత్తనాలకు ఖమ్మం పోతే నేను ఒకటి అడిగితే వాళ్లు ఇంకో కంపెనీ విత్తనం ఇస్తమన్నరు. అడిగిన కంపెనీ ఇయ్యమంటే.. కూపన్ తెమ్మన్నరు. నాకు అయ్యేవి తెలవదంటే అడిగిన కంపెనీ విత్తన ప్యాకెట్‌పై ఒక్కోదానికి రూ.500 అధికంగా ఇయ్యమన్నరు. మళ్లీ తోట పండకపోతే ఎందుకొచ్చిందని.. పత్తి గింజల ప్యాకెట్లు తీసుకుని అచ్చిన. అది వేద్దామంటే చినుకు పడట్లే. ఏదో నిన్న గింతంత వానొచ్చింది. అది గింజలు మొలవడానికి సరిపోదుకానీ ఆలస్యమవుతుందని అచ్చు తోలుతున్నా.
రైతుల్లో అపోహ ఉంది - అనసూయ, ఖమ్మం జిల్లా ఉద్యాన, పట్టు అధికారిణి
ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాల వరకు మిర్చి సాగు చేస్తారని అంచనా వేశాం. ఎకరానికి పది ప్యాకెట్ల చొప్పున సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. కానీ రైతులు ఒకటి, రెండు కంపెనీల విత్తనాలపైనే ఆసక్తి చూపుతున్నారు. వాస్తవానికి ఖమ్మం మార్కెట్లో అందుబాటులో ఉన్న మిర్చి విత్తనాలన్నీ నాణ్యమైన రకాలే. రైతులు లేనిపోని అపోహ వీడాలి. గతేడాది తామరనల్లి ప్రభావంతో తోటలన్నీ పోయాయి. కొంతమేరకు మాత్రమే దిగుబడి వచ్చింది. దాని ఆధారంగా ఒకటి, రెండు కంపెనీలపై ఆసక్తి చూపుతున్నారు. అందుకే బ్లాక్ సమస్య ఉత్పన్నమతుండవచ్చు. దీనిపై మేము దృష్టి సారించి చర్యలు తీసుకుంటాం.