Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుస్నాబాద్‌లో ఉద్రిక్తం
- మా రక్తంతో పంటలు పండిస్తారా?
- టీఆర్ఎస్ కార్యకర్తలకు మాపై కాఠిÄన్యమెందుకు?
- రెండో రోజూ గౌరవెల్లి నిర్వాసితుల ఆందోళన
- గులాబీ నాయకుల కవ్వింపు చర్యలు
- చక్కదిద్దే క్రమంలో పోలీసులకు గాయాలు
- సొమ్మసిల్లిన ముగ్గురు నిర్వాసిత మహిళలు
- ధ్వంసమైన వాహనాలు
నవతెలంగాణ-హుస్నాబాద్
పోలీసుల దాడి, టీఆర్ఎస్ కార్యకర్తల కవ్వింపు చర్యలతో మంగళవారం ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల ప్రజల ఆర్తనాదాలతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మరోసారి రణరంగంగా మారింది. గౌరవెల్లి నిర్వాసితులు తమకు న్యాయంగా రావాల్సినవి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని అడుగుతుంటే పోలీసులు, అధికారపార్టీ నాయకులు వారిపై దాడికి దిగుతూ కవ్వింపుచర్యలకు పాల్పడ్డారు. ఆదివారం అర్థ్రరాత్రి వారి ఇండ్లపైకి పోలీసులు వెళ్లి దాడులు చేయడంతో దానికి నిరసనగా మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన నిర్వాసితులపైకి టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. ప్రాజెక్టు ట్రయల్ రన్ మొదలుపెట్టాలని హుస్నాబాద్ ఆర్డీవోకు వినతిపత్రాన్ని ఇచ్చేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఆ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు నిర్వాసితుల ఆందోళనకు దారితీసింది. హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి వినతిపత్రాన్ని ఇవ్వాలనే ప్రయత్నాన్ని వందలాది మంది నిర్వాసితులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ నాయకుల తీరును గర్హిస్తూ నిర్వాసితులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలోని హనుమకొండ రోడ్డుపై బైటాయించారు. తమ ద్ణుఖాన్ని ఆపి సంబురాలు చేసుకోండని విలపించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి నినాదాలు చేశారు. క్యాంపు కార్యాలయం ముట్టడికి తరలివచ్చిన నిర్వాసితులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
'ఇప్పటికే నలభై మందిదాకా భూమి బెంగతో సచ్చిపోయిండ్రు. ఇగ మమ్ములను గూడా ప్రాజెక్టుల బొందవెట్టుండ్రి.మా రక్తాన్ని పంటలకు పారియ్యుం డ్రి'అంటూ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు విలపిం చారు. భూములు, ఇండ్లుపోయి గోసపడుతున్నా మని, తామేం దౌర్జన్యం చేస్తలేమని, చట్ట ప్రకారం తమకు రావాల్సిన పరిహారాన్ని అడుగుతున్నామని, తమకు సహకరించాలని నిర్వాసితులు ప్రాధేయపడ్డారు. ఒకరినొకరు తోపులాడుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చిన పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. పరిస్థితి అదుపుతప్పడంతో తోపులాట జరిగింది. ఆర్డీవో కార్యాలయానికి వెళ్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలను నిర్వాసితులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సుమారు కిలోమీటరున్నర దూరాన ఉన్న ఆర్డీవో కార్యాయానికి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మళ్లీ తోపులాట జరిగింది. దాంతో హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, ఎస్ఐ శ్రీధర్‌కు గాయాలయ్యాయి. నిర్వాసితులు నల్ల అనసూయ, కలువల సుమలత, నోముల అనితకు గాయాలు కావడంతో సొమ్మసిల్లి పడిపోయారు. వారిని 108లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాంతో నిర్వాసితుల్లో మరింత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించేందుకు ఒక్కసారిగా కదిలివచ్చారు. అక్కడ పోలీసులతో మరోసారి తోపులాట జరిగింది. ఎలాగైనా ఆందోళనకారులను చెదరగొట్టాలని పోలీసు బలగాలు ఒక్కసారిగా నిర్వాసితులపైకి దూసుకు వచ్చి బలవంతంగా తోసేశారు. పోలీసుల చర్యతో వృద్ధులు, మహిళలు భయాందోళన చెందారు. తమను చంపుతారా అంటూ నిర్వాసితులు విలపించారు. కొద్దిసేపు పోలీస్‌స్టేషన్ ఎదుట బైటాయించి ఆందోళన చేశారు. అనంతరం మల్లెచెట్టు చౌరస్తాలో బైటాయించారు.
ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాం: సిద్దిపేట సీపీ శ్వేత
కలెక్టర్‌తో పాటు ప్రభుత్వంతో మాట్లాడి నిర్వాసితులకు చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చూస్తానని, ఆందోళన విరమించాని సిద్దిపేట సీపీ శ్వేత అన్నారు. రెండు రోజులు ఓపికగా ఉంటే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ వచ్చి తమకు హామీ ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేయడంతో మాట్లాడిస్తానని చెప్పారు. సీపీ హామీ ఇవ్వడంతో రాత్రి 8.30 గంటలకు నిర్వాసితులు తిరిగి వెళ్లారు.