Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారుపై తీవ్ర అసంతృప్తిలో గ్రామస్థాయి ఉద్యోగులు
- ఇంకా విధుల్లో తీసుకోకపోవడంతో ఫీల్డు అసిస్టెంట్ల ఆగ్రహం
- హామీల బుట్టదాఖలుతో గుర్రుగా వీఆర్ఏలు
- మానసికంగా కుంగిపోయిన వీఆర్వోలు
- పనిభారంతో పంచాయతీ కార్యదర్శుల ఇక్కట్లు
- ప్రజల్ని ప్రభావితం చేయడంలో వీరి పాత్ర కీలకం
- మొదటికే మోసం తెచ్చేలా సర్కారు అనాలోచిత నిర్ణయాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సంక్షేమరాజ్యమంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కారు ఆ ఫలాలను ప్రజలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించే క్షేత్రస్థాయి అధికారులపై పడగ విప్పి బుసలుకొడుతున్నది. పల్లెల్లో పదిమందికి ఉపాధి చూపే ఫీల్డు అసిస్టెంట్లను విధుల్లో తీసుకోకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నది. అసెంబ్లీలో వీఆర్ఏలకిచ్చిన పేస్కేలు, వారసత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీలు సీఎం కేసీఆర్ నోటిమాటకే పరిమితమైపోయాయి. రెవెన్యూ వ్యవస్థలో అణువణువూ తెలిసిన వీఆర్వోలపై అవినీతి ముద్ర వేసి ఆ వ్యవస్థకు రాష్ట్ర సర్కారు మంగళంపాడిన విషయం విదితమే. పంచాయతీ కార్యదర్శులు తీవ్రపనిభారంతో తల్లడిల్లుతున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. సంఖ్యా పరంగా వీరు 45వేల మందే ఉన్నా రాష్ట్ర సర్కారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ఈ ఉద్యోగులంతా క్షేత్రస్థాయిలో ప్రజలను ప్రభావితం చేయడంలో కీలకంగా మారే అవకాశముంది. అందుకే, ఈ సెక్షన్ ఉద్యోగులపై దృష్టి పెట్టి రాజకీయంగా గ్రామాల్లో పట్టు పెంచుకునే యత్నాల్లో ప్రతిపక్ష పార్టీలున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు వారి విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటే మంచి జరిగే అవకాశముంది. లేకుంటే, టీఆర్ఎస్కు రాజకీయంగా నష్టం చేకూరడం ఖాయం.
గ్రేడ్లుగా విభజంచి వేతనాల్లో కోతలు కోస్తూ తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టేలా తెచ్చిన జీవో నెంబర్ 4779ని నిరసిస్తూ ఉపాధి హామీ చట్టం కింద పనిచేస్తున్న ఫీల్డు అసిస్టెంట్లు రెండేండ్ల కింద సమ్మెబాట పట్టారు. ప్రశ్నించే స్వభావాన్ని తట్టుకోలేని రాష్ట్ర సర్కారు..'మాకే ఎదురుతిరుగుతారా?' అంటూ ఫీల్డు అసిస్టెంట్ వ్యవస్థనే రద్దు చేస్తున్నట్టు 2020 మార్చిలో ప్రకటించింది. చట్టం రూపుదిద్దుకున్న నాటి నుంచి పనిచేస్తున్న 7500 మంది ఫీల్డు అసిస్టెంట్లు రోడ్డున పడ్డారు. వీరిలో 7,300 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక తరగతుల వారే ఉన్నారు. ఆనాటి నుంచి తమ డిమాండ్ల కోసం రెండేండ్లపాటు నిరంతరాయంగా పోరాడారు. సంఖ్యాబలంగా తక్కువే ఉన్నప్పటికీ తమ పోరాటతత్వాన్ని ఎన్నడూ వీడలేదు. మూడుసార్లు చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టి సర్కారుకు మూడుచెరువుల నీళ్లు తాగించారు. ఈ క్రమంలో ఉపాధి హామీ కూలీలపై మంచి పట్టున్న వారిలో అసంతృప్తి తీవ్రస్థాయికి చేరితే ప్రమాదముందనే విషయం సర్కారు దృష్టికి వెళ్లింది. దీంతో 'విధుల్లో తీసుకుంటాం' అని సీఎం కేసీఆర్ మార్చి 2022లో ప్రకటించారు. మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఇలా నెలలు గడుస్తున్నాయి.. గ్రామాల్లో ఈ సీజన్ ఉపాధి పనులూ అయిపోవచ్చాయి గానీ నేటికీ వారిని ఉద్యోగాల్లోకి తీసుకున్న పాపాన రాష్ట్ర సర్కారు పోలేదు. ప్రశ్నించేతత్వాన్ని సహించలేని రాజ్యం వారి విషయంలో ఇంకా నాన్చుతూనే ఉన్నది.
వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించిన నాటికి 5,088 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని భూముల వివరాలు, లొసుగులన్నీ తెలిసింది వీఆర్వోలకే. వీరికి ప్రజలతోనూ సత్సంబంధాలున్నాయి. వారిని జూనియర్ అసిస్టెంట్లుగా పంచాయతీరాజ్, వ్యవసాయ, మున్సిపల్ శాఖల్లో చేరుస్తారనే చర్చ నడిచినప్పటికీ అతీగతీ లేదు. ఈ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత వీఆర్వోలకు ఓ విధి అంటూ లేకుండా పోయింది. అధికారులు ఏది చెబితే అది చేయడమే వీరి పనిగా మారింది. దీంతో వీఆర్వోలంతా మానసికంగా చాలా మేరకు కుంగిపోయి తీవ్ర ఆక్రోశంతో ఉన్నారు. మొత్తం వీఆర్వోలనే తీసేసినప్పుడు వారికి సహాయకులుగా నియమించిన వీఆర్ఏల పరిస్థితి ఏంటనే దానిపై స్పష్టత లేదు. 'వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం..పేస్కేలు ఇస్తాం..వారసత్వ ఉద్యోగవకాశాలు కల్పిస్తాం..డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తాం' అని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ సముద్ర తీరాన ఇసుకమీద రాసిన రాతలాగే మిగిలిపోయింది. సర్కారు ఎత్తుగడలతో మొన్నటిదాకా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు విడివిడి సంఘాలుగా కొట్లాడిన వీఆర్వోలు, వీఆర్ఏలు నేడు ఐక్యంగా ముందుకు సాగటం సీఎం కేసీఆర్‌కు మింగుడు పడని అంశమే.
పంచాయతీ కార్యదర్శుల కష్టాలకడలి మరో రకంగా ఉంది. ఉదయం ఆరు గంటలకే టెన్షన్‌గా ఊరుబాట పట్టి ఏ రాత్రికో ఇంటికి చేరుకుంటున్న దైన్యస్థితి. ఓవైపు ఉన్నధికారులు సవాలక్ష ఆర్డర్లు..రిపోర్టుల మీద రిపోర్టులు ఇవ్వాలంటూ ఆదేశాలు.. తప్పయినా మేం చెప్పినట్టు చేయాల్సిందేనంటూ మరోపక్క క్షేత్రస్థాయిలోని అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వారి పరిస్థితి ముందునుయ్యి..వెనుక గొయ్యిలా తయారైంది. వేతనం పెంచినప్పటికీ మూడేండ్ల ఒప్పందకాలాన్ని నాలుగేండ్లకు పొడిగిస్తూ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయంపై జూనియర్ పంచాయతీరాజ్ కార్యద ర్శులు గుర్రుగా ఉన్నారు. పనిఒత్తిళ్లకు తాళలేక, ఎస్ఐ, ఇతర ఉద్యోగాలు పొందిన క్రమంలో రాజీనామాలు చేసిన కార్యదర్శుల స్థానంలో కొందర్ని ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నారు. అలా తీసుకున్న వారిలో 317 జీఓ పేరుతో రాత్రికిరాత్రే 400 మంది ఔట్సోర్సింగ్ పంచాయ తీకార్యదర్శులను సర్కారు ఇంటికి సాగనంపింది. వీరంతా ప్రభుత్వంపై ఆక్రోశంతో ఉన్నారు.
రాజకీయంగా టీఆర్ఎస్కు ఎఫెక్టే
క్షేత్రస్థాయిలో పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఆ నలుగురిపై సర్కారు వ్యవహరిస్తున్న తీరు రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ నాలుగు విభాగాల ఉద్యోగులు కలిపితే రాష్ట్రంలో 45 వేలకుపైగా ఉన్నారు. ఒక్కో నియోజకవర్గంలో సగటున వీరు 400 మంది (హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాలను మినహాయించి)కిపైగా ఉన్నారు. వీరంతా ప్రభుత్వంపై తమకున్న అసంతృప్తితో నియోజకవర్గంలో ఒక్కొక్కరు కనీసం 30 నుంచి 50 మందిని ప్రభావితం చేసినా 12 వేల నుంచి 20 వేల ఓట్లకు ఎఫెక్టు పడే అవకాశం ఉంది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీపై సహజంగానే కొంతమేర అసంతృప్తి ఉంది. దీనికి తోడు ఈసారి హోరాహోరిగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అభ్యర్థి అయినా 5 వేల నుంచి 15 వేల ఓట్లతోనే గెలిచే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో ఆ ఉద్యోగుల పాత్ర కీలకం కానున్నదనే చర్చ నడుస్తున్నది. అందుకే ఆ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా పరిష్కరిస్తే దానికి అంత మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.