Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల పోరాటం ప్రజా హక్కుల పరిరక్షణ కోసమే
- ఐక్యంగా ఉద్యమించండి...మీ వెంట మేముంటాం : టీఎస్ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర సదస్సులో ప్రతిపక్షపార్టీల హామీ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మహా మహా నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ కలకాలం అక్కడే ఉండరు. ప్రజాగ్రహానికి గురికావల్సిన సమయం ఎంతో దూరంలో లేదు. 52 రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఆ తర్వాతా ఆయన చేసిన, చేస్తున్న నియంత, నియంతృత్వ పరిపాలనను చరిత్ర గమనిస్తూనే ఉంది. ప్రతీకార సమయం కోసం ప్రజలు, ఆర్టీసీ కార్మికులు ఎదురుచూస్తున్నారు'' టీఎస్ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'ఆర్టీసీ రక్షణ-కార్మిక హక్కుల పరిరక్షణ' అంశంపై జరిగిన రాష్ట్ర సదస్సులో ప్రతిపక్షపార్టీల నాయకులు చేసిన హెచ్చరికలు ఇవి. ఆర్టీసీలో కార్మిక సంఘాలపై నిర్బంధం ప్రయోగించి, ఇప్పుడు దేశాన్ని ఉద్ధరిస్తానంటూ బయల్దేరారని ఎద్దేవా చేశారు. జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో కార్మికులు ఎదుర్కొంటున్న పనిభారాలు, వారికి రావల్సిన ఆర్థిక ప్రయోజనాలు, యాజమాన్యం సొంతానికి వాడేసుకున్న కార్మికుల పొదుపు సొమ్ము, ప్రయివేటీకరణ ప్రయత్నాలు సహా అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఆయన సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, తెలంగాణ జన సమితి, తెలంగాణ ఇంటిపార్టీ, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, ఎమ్సీపీఐ న్యూడెమోక్రసీ, ఆప్ సహా పలు రాజకీయపార్టీలు తమ మద్దతు తెలుపుతూ ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ పోరాటాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చాయి.
ఆర్టీసీ కార్మికుల వెంటే ఉంటాం
సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ఆర్టీసీ రక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణకు మేం పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. ప్రపంచాన్ని జయిస్తామని విర్రవీగిన హిట్లర్ వంటి మహా నియంతలే చరిత్ర గర్భంలో కలిసిపోయారు. ఆర్టీసీ కార్మికుల 52 రోజుల సమ్మె చారిత్రాత్మకం. దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదు. అవన్నీ చరిత్రగా ప్రజల ముందే ఉన్నాయి. ఆ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలు చెప్పి, కార్మికులను వంచించారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలపై నిర్భంధ ప్రయోగాలు చేస్తూ రాక్షసపాలన కొనసాగిస్తున్నారు. ఇలాంటి నియంతల్ని చరిత్ర అనేకమందిని చూసింది. టీఎస్ఆర్టీసీ జేఏసీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పూర్తిగా ఆమోదిస్తున్నాం. భవిష్యత్ సమరశీల పోరాటాలకు అండగా ఉంటాం. దానికోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, మా శక్తియుక్తులన్నీ ప్రదర్శిస్తాం. విశాల ప్రజా ప్రయోజనాల కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటం ఇది. దీనికి ప్రజలు మద్దతు తెలపాలి. ఐక్యతే ప్రధానంగా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ జరగాలి. ప్రజా ఆస్తులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే కుట్రలు జరుగుతున్నాయి. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం.
మరో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరు
సీపీఐ ఇంచార్జ్ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి
కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ...రాష్ట్రంలో వాటినే అమలు చేస్తామంటే కుదరదు. తన ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట స్పష్టత ఇవ్వాలి. ఆర్టీసీకి వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి. వాటిని ప్రయివేటుకు అప్పగించే కుట్రలో భాగంగానే సంస్థ నష్టాల్లో ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ పరిరక్షణకు ప్రజల్ని సమీకరించే బాధ్యతను రాజకీయపార్టీలు తీసుకోవాలి. ప్రజల్లోనూ ఆ కదలిక రావాలి. వారి మద్దతు ఉంటేనే ఉద్యమాలు విజయవంతం అవుతాయి. త్వరలో ఎన్నికలు వస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరాక తప్పదు. దానికోసం మరో ప్రజాస్వామ్య ఉద్యమం వస్తుంది. దాన్ని ఎవరూ ఆపలేరు.
భవిష్యత్ తరాల కోసమైనా తెగించి కొట్లాడాలి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు రవి
భవిష్యత్ తరాల కోసమైనా ఆర్టీసీ కార్మికులు సంస్థ పరిరక్షణ కోసం తెగించి కొట్లాడాలి. వారికి ప్రజలు మద్దతు ఇవ్వాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన లేదు. నిరంకుశ, నియంతృత్వ పాలన కొనసాగుతుంది. సకల జనుల సమ్మె అలవెన్స్ ఇవ్వాలని ఇప్పటికీ టీఎస్ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారంటే ప్రభుత్వానికి ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం మరొకటి లేదు. కాంగ్రెస్పార్టీ వారికి అండగా ఉంటుంది. భవిష్యత్ కార్యాచరణలో కలిసివస్తాం.
పేరు మార్పు తప్ప...చేసిందేమీ లేదు
కే రమ, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు
ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీఎస్ఆర్టీసీని టీఎస్ఆర్టీసీగా పేరు మార్చారే తప్ప, సంస్థకు, ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. పైగా కార్మికులకు కష్టాలు, ఇబ్బందుల్ని పెంచారు. కార్గో సర్వీసుల పేరుతో డ్రైవర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. పనికి తగినట్టు వేతనాలు పెంచలేదు. ఆర్టీసీ కార్మికుల మరోసారి ఉద్యమ బాట పట్టాలి. వారికి అండగా ప్రత్యక్ష కార్యాచరణలో పాల్గొంటాం.
స్వరాష్ట్రంలో పరాయివాళ్లుగా మిగిలాం
చెరుకు సుధాకర్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు పరాయివాళ్లుగా మిగిలిపోయారు. ఆర్టీసీ నిజాం ఆస్తి. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత సొత్తు కాదు. ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించాలి. దానివల్ల సంస్థలో, ప్రభుత్వంలో తప్పకుండా మార్పు వస్తుంది. ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ పోరాటాల్లో వారికి అండగా ముందు వరుసలో నిలుస్తాం.
ఢిల్లీని చూసి నేర్చుకోండి
ఇందిరాశోభన్, ఆప్ రాష్ట్ర చైర్పర్సన్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీని చూసి నేర్చుకోవాల్సి విషయాలు చాలా ఉన్నాయి. అప్పు లేకుండా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలోకి తేవాలో తెలుసుకోవాలి. అక్కడి ఆర్టీసీ అన్ని వర్గాలకు రాయితీలు ఇస్తూ కూడా 2.8 శాతం లాభాల్లో ఉంది. నిత్యవసరాలతో పాటు తాజాగా విద్యార్థుల బస్పాస్ చార్జీలు కూడా పెంచారు. మీరు ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. మరి కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రకటన ఎందుకు చేయరు? కేంద్రప్రభుత్వం ఆర్టీసీకి ఏమిచ్చిందో రాష్ట్ర బీజేపీ నేతల్ని ప్రశ్నించండి. కార్మికుల పోరాటంలో మేం ముందు వరుసలో నిలుస్తాం.
ధ్వంసం చేస్తామంటే ఊరుకోం
గోవర్థన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ
స్వతహాగానే ఆర్టీసీ కార్మికులకు పోరాడే చరిత్ర ఉంది. దాన్ని ఎలా కాపాడుకోవాలో వారికి బాగా తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ధ్వంసం చేస్తామంటే చూస్తూ ఊరుకోం. ఐక్యంగా పోరాడదాం.
కేసీఆర్ ఓడితేనే ఆర్టీసీ బతుకుతుంది
ప్రొఫెసర్ కోదండరాం, అధ్యక్షులు, తెలంగాణ జన సమితి
ఆర్టీసీ బతకాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలి. అప్పుడే ఆ సంస్థ పరిరక్షణ సాధ్యమవుతుంది.ప్రజా ఆస్తుల్ని ఇష్టం వచ్చినట్టు అనుభవిస్తామంటే ఎలా ఊరుకుంటాం.ఆర్టీసీ కార్మికులది ఆత్మగౌరవ సమస్య.ఎక్కడైతే హక్కుల హననం, ఆత్మగౌరవం కోల్పోతామో అక్కడే పోరా టాలు వస్తాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఆర్టీసీ పరిరక్షణ కోసం మరో సకల జనుల సమ్మెకు సిద్ధం. కలిసి కొట్లాడండి. మీ వెంట మేం ఉంటాం.
కార్యక్రమ ప్రారంభంలో టీఎస్ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మెన్ కె హన్మంతు ముదిరాజ్ నేతల్ని వేదికపైకి ఆహ్వానించారు. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయాస్ స్టాండింగ్ కమిటీ కన్వీనర్ పీ చంద్రారెడ్డి తన అనుభవాలను పంచుకొన్నారు. జేఏసీ కన్వీనర్ పి కమాల్రెడ్డి, కో కన్వీనర్లు జీ అబ్రహం, కే యాదయ్య, బీ సురేష్, బీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జేఏసీ కన్వీనర్ వీఎస్ రావు వందన సమర్పణ చేశారు.