Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తులసీ హౌసింగ్ సొసైటీ కౌంటర్ వేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓయూలో భూ ఆక్రమణలపై పోలీస్ విచారణ వివరాలతో నాలుగు వారాల్లోగా రిపోర్టు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత నోటీసులకు అనుగుణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసీ హౌసింగ్ సొసైటీ కౌంటర్ వేయకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జూలై 14న జరిగే తదుపరి విచారణలోగా సౌసైటీ కౌంటర్ వేయాలని నోటీసులిచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ భూమి అన్యాక్రాంతంపై దాఖలైన పిల్‌ను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. అన్యాక్రాంతంపై పోలీసులు చేస్తున్న దర్యాప్తు స్థాయి నివేదిక అందజేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పిటిషన్లో పేర్కొన్న ఓయూలోని 3,500 చదరపు గజాల భూమిలో నిర్మాణాలు చేయరాదనీ, ఆభూమిని ఇతరులకు బదలాయింపులు, రిజిస్ట్రేషన్లు చేయరాదన్న గత ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఉస్మానియా వర్సిటీ భూమి అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వర్సిటీ స్టూడెంట్ రమణారావు పిల్ దాఖలు చేసిన విషయం విదితమే.
మానసిక రోగుల తరలింపుపై రిజర్వులో తీర్పు
సంగారెడ్డిలోని గవర్నమెంట్ ఆస్పత్రిలోని మానసికంగా బాధపడే వాళ్లను తరలించాలనే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతూ న్యూ లైఫ్ సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిని జస్టిస్ అభిషేక్‌రెడ్డి విచారించారు. అక్కడ వైద్యం పొందుతున్న వాళ్లను ఎర్రగడ్డకు తరలించే ప్రయత్నాలు అడ్డుకోవాలని పిటిషనర్ వాదన. సంగారెడ్డి ఆస్పత్రిని విస్తరించేందుకే అక్కడున్న మానసిక వైకల్య బాధితులను ఎర్రగడ్డకు తరలించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్పింది. ఇరువురి వాదనల తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది.