Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చరిత్రపుటల్లో నిలిచిపోయేలా నిర్వహిస్తాం: కె. నారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలో సెప్టెంబర్ నాలుగో తేదీ నుంచి ఏడో తేదీ వరకూ సీపీఐ రాష్ట్ర మూడో మహాసభలను నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ప్రకటించారు. చరిత్రపుటల్లో నిలిచిపోయేలా మహాసభలు నిర్వహిస్తామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని మఖ్దూమ్ భవన్లో రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారనీ, మహాసభల ద్వారా పార్టీకి పూర్వవైభవం తేవాలని పిలుపునిచ్చారు. బీజేపీ చేస్తున్న విభజన రాజకీయాలు దేశంలో హింసను పెంచుతున్నాయనీ, లౌకికతత్వం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను ద్వంసం చేస్తూ అఖండ హిందూ భారతదేశంగా మార్చే కుట్రకు మోడీ సర్కారు పూనుకున్నదని విమర్శించారు. ప్రశ్నిస్తే దేశద్రోహం, ఈడీ, సీబీఐ కేసులు బనాయిస్తున్నారని వాపోయారు. ఆర్థిక అసమానతలు దేశంలో పెరిగిపోతున్నాయనీ, కార్మికులు, యువత, రైతులు, వ్యవసాయ కార్మికులలో అసంతృప్తి పెరుగుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో కూడా ప్రజలకిచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారనీ, ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో పేద ప్రజల భూములను పోలీసులతో ఉక్కుపాదం మోపి బలవంతంగా లాక్కుంటున్నారని విమర్శించారు. మోడీ, కేసీఆర్ పాలనలకు వ్యతిరేకంగా శక్తికి మించి ప్రజా ఉద్యమాలను నిర్మించాలన్నారు. సృజనాత్మక పద్ధతుల్లో ప్రచారం నిర్వహించి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్యెల్యే కొండిగారి రాములు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ తదితరులు పాల్గొన్నారు.