Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నతాధికారులు వర్సెస్ సంఘాల నాయకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో కోల్డ్ వార్ కొనసాగుతున్నది. గత కొంత కాలంగా వైద్యారోగ్యశాఖలో తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదస్పదమై భిన్నాభిప్రాయాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. కొత్తగా ప్రభుత్వ సర్వీసులో చేరనున్న వారి ప్రయివేటు ప్రాక్టీసు రద్దు, ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత, డాక్టర్లే బయటికి మందులు రాస్తున్నారన్న ప్రచారం తదితర అంశాలపై ఆయా సంఘాల నాయకులు, ఉన్నతాధికారులు పరస్పరం విరుద్ధమైన ప్రకటనలిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లో సమస్యలన్నింటికీ డాక్టర్లే కారణమన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో వారు తమ వాదనను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు అలాంటి నాయకుల జాబితా తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఒక్కసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వ్యవస్థలో మార్పు కోసం పోరాడుతున్న తమను లక్ష్యంగా చేసుకునేందుకు జాబితాను తయారు చేస్తే ఊరుకునేది లేదనీ, తాము కూడా అవినీతిపరులైన ఉన్నతాధికారుల చిట్టా బయటకు తీస్తామని హెచ్చరిస్తున్నారు. తమను టార్గెట్ చేస్తే అధికారులను టార్గెట్ చేయడం తమకూ తెలుసని ధీమా వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ల న్యాయపరమైన హక్కుల కోసం పోరాడుతున్న నాయకుల లిస్టును సేకరిస్తున్న ఉన్నతాధికారుల అవినీతి చిట్టాను కూడా సేకరించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు మేలు చేసేందుకు నిబంధనల్లో మార్పు చేస్తుంటే కొన్ని మెడికల్ యూనియన్లు స్వలాభం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఉన్నతాధికారులు చేస్తున్న ప్రచారం మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.