Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య
- జాగ్రత్తలు సూచిస్తున్న డాక్టర్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులెక్కువగా నమోదవుతున్నాయి. అదే సమయంలో ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. రోజువారీగా డిశ్చార్జి అవుతున్న వారి కంటే కొత్త కేసులెక్కువగా ఉంటుండటంతో అదే స్థాయిలో యాక్టివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కొన్ని నెలలుగా నామమాత్రంగా మారిపోయిందని భావించిన కోవిడ్-19 వ్యాప్తి గత 10 రోజులుగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. రోజువారీ కేసుల్లో 100కు పెగా నమోదు కావడం, యాక్టివ్ కేసులు వెయ్యి దాటిపోవడం, పాజిటివ్ రేటు దాదాపు ఒక శాతానికి ఎగబాకడం ఇటీవల చోటు చేసుకున్న పరిణామం. అయితే మరణాలు లేకపోవడం ఉపశమనం కలిగిస్తున్నది. అయినప్పటికీ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సూచిస్తున్నది.
గత వారం రోజుల్లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 378 ఉంటే కొత్త కేసులు 912 రావడం గమనార్హం. అదే సమయంలో వారం క్రితం 658 యాక్టివ్ కేసులుంటే అవి కాస్తా 1,116కు పెరిగాయి. ఈ వారంలో ఏడో తేదీన 119, ఎనిమిదిన 116, తొమ్మిదిన 122, పదిన 15, 11న 145, 12న 129, 13న 126 కొత్త కేసులొచ్చాయి. అదే సమయంలో ఏడో తేదీన 43 మంది, ఎనిమిదిన 43, తొమ్మిదిన 122, పదో తేదీ 59, 11న 75, 12న 67, 13న 49 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజలు విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కోరింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, అవసరమైతే తప్ప జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. రిస్క్ గ్రూపుకు చెందిన వారు మరింత అప్రమత్తంగా ఉండాలనీ, అర్హులందరు వ్యాక్సిన్ వేసుకోవాలని డాక్టర్లు కోరుతున్నారు.