Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిర్మల్ జిల్లా బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. బాసరలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. 900 మంది విద్యార్థులు చదువుతున్న క్యాంపస్‌లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. మెస్, తాగునీటి సమస్యను పరిష్కరించాలనీ, టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని తెలిపారు. వీసీ క్యాంపస్‌లో ఉండకపోతే విద్యార్థులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. మెస్ టెండర్లను మార్చాలని విద్యార్థులు పలుమార్లు డిమాండ్ చేసినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. తక్షణమే వాళ్ల డిమాండ్లను టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
విద్యార్థుల పోరాటానికి మద్దతు : ఏఐఎస్ఎఫ్
బాసర త్రిపుల్ ఐటీలో తాగునీటి వసతి కల్పించాలనీ, వీసీ వర్సిటీలోనే అందుబాటులో ఉండాలని సంఘటితంగా పోరాడుతున్న విద్యార్థుల పోరాటానికి తమ మద్దతు ప్రకటిస్తున్నట్టు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అశోక్ స్టాలిన్, రావి శివరామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం : పీడీఎస్‌యూ
ఐఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో నీళ్ల కోసం విద్యార్థులు ఆందోళన చేయాల్సి రావడం ప్రభుత్వ అసమర్ధ పాలనకు నిదర్శనమని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎమ్.నాగేశ్వర్రావు, బి.రాము ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెక్నికల్ విద్యకు అవసరమైన డిజిటల్ సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు కోరుతుంటే అధికారులు, ప్రభుత్వ పెద్దలు పెడచెవిన పెట్టడం దారుణమని తెలిపారు.
సౌకర్యాలు మెరుగుపర్చాలి : టీజీపీఏ
బాసర త్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల నీ, సౌకర్యాలను మెరుగుపర్చాలని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ (టీజీపీఏ) వ్యవస్థాపక అధ్యక్షులు మోత్కూరి యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిష్టాత్మకమై న విద్యాసంస్థలోనే విద్యార్థులు సమస్యలున్నా యని రోడ్లమీదకు రావడం శోచనీయమని విమర్శించారు. ఈమేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు.