Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర రాష్ట్రాలకు టీఎస్ ఆర్టీసీ సర్క్యులర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచిందంటే ఇదే! అడ్డగోలుగా బస్సు చార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ యాజమాన్యం...ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా తాము పెంచినట్టే బస్సు చార్జీలుపెంచాలని సూచిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. టీఎస్ఆర్టీసీ డీజిల్ సెస్ పేరుతో ఇటీవల ఆర్టీసీ బస్ ఛార్జీలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. దీనితో ప్రయాణికులు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఆబస్సుల్లో టిక్కెట్ రేట్లు తెలంగాణ ఆర్టీసీ బస్సులకంటే తక్కువ ఉండటమే దీనికి కారణం. ఫలితంగా టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకుల ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) దారుణంగా పడిపోయింది. దీనితో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపించే ఆర్టీసీ సంస్థలకు టీఎస్ ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేసింది. అంతర్రాష్ట్ర రవాణా సంస్థల ఒప్పందం ప్రకారం ఆయా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు ఛార్జీలు ఒకేలా ఉండాలనే నిబంధన ఉందనీ, అందువల్ల ఇతర రాష్ట్రాలు కూడా బస్సు చార్జీలు పెంచాలనేది ఆ సర్క్యులర్ సారాంశం. దీన్ని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపినట్టు టీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులు పెరగడంతో టీఎస్ఆర్టీసీ అధికారులు కంగుతింటున్నారు. అయితే ఈ సర్క్యులర్ అందుకున్న వెంటనే ఏపీఎస్ఆర్టీసీ అధికారులు టీఎస్ఆర్టీసీకి వెంటనే సమాధానం చెప్పినట్టు తెలిసింది. ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయినందున తెలంగాణ ప్రాంతంలో తిరిగే తమ బస్సుల ఛార్జీలపై ఇప్పుడప్పుడే నిర్ణయం తీసుకోలేమని తేల్చిచెప్పినట్టు సమాచారం.