Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై పోలీసులు మూకుమ్మడిగా దాడిచేసి అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి అత్యంత హేయమైన చర్య అని తెలిపింది. వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడంతోపాటు వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ నిర్వహించేందుకు కాలువ నిర్మాణం కోసం నీటిపారుదల శాఖ గుడాటిపల్లిలో సర్వే నిర్వహిస్తున్నదని తెలిపారు. వివిధ విభాగాల కింద ఈ గ్రామస్తులకు ఇంకా పరిహారం రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరిహారం ఇవ్వకుండా తమను తరలించొద్దనీ, ట్రయల్ రన్ నిలిపేయాలని కోరుతూ సుమారు 700 మంది నిర్వాసితులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారని తెలిపారు. వారి భూములు, ఇండ్లు సర్వస్వం ప్రాజెక్టుకు ఇచ్చిన నిర్వాసితులకు తగిన పరిహారం ఇవ్వకపోగా వారిపైనే దాడికి పాల్పడటం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. అర్ధరాత్రి ఇండ్లపై దాడి చేసి మహిళలనీ చూడకుండా పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని తెలిపారు. కొంతమంది యువకుల తలలు పగిలాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భూనిర్వాసితులకు న్యాయం జరిగేవరకూ తమ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
కేరళ సీఎం విజయన్‌పై దాడికి సీపీఐ(ఎం) ఖండన
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు విమానంలో దాడికి ప్రయత్నించడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు కారణమైన యూత్ కాంగ్రెస్ నేతలపై ఎయిర్పోర్ట్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. విజయన్ ప్రయాణిస్తున్న ఇండిగో విమానం కన్నూరు నుంచి తిరువనంతపురం వెళ్తున్న సందర్భంగా యూత్ కాంగ్రెస్ దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని విమర్శించారు. వారు మద్యం తాగి తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించడంతోపాటు కేరళ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని తెలిపారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత సైతం గందరగోళం సృష్టించారని పేర్కొన్నారు. విజయన్‌కు రాష్ట్ర ప్రజలు మద్దతు ఉన్నంతకాల ఇటువంటి అల్లరిమూకల ప్రయత్నాలు సాగవనీ, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.