Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ పార్టీ దుర్మార్గాలు బయటపెడతాం
- రెండోరోజు దీక్షలో రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. దేశ స్వాతంత్య్రం కోసం నేషనల్ హెరాల్డ్ పత్రికను 1937లో నెహ్రూ ప్రారంభించారని గుర్తుచేశారు. స్వాతంత్య్రానంతరం అప్పులతో పత్రిక మూతపడిందని తెలిపారు. దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ భావాజాలాన్ని తిప్పికొట్టేందుకు నేషనల్ హెరాల్డ్ పేపర్‌ను కాంగ్రెస్ ఊపిరి పోసుకుని పున:ప్రారంభించిందన్నారు.
బీజేపీ దుర్మార్గాలను నేషనల్ హెరాల్డ్ పేపర్ బయటపెడుతున్నదని కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్రం ఫిర్యాదు చేసిందని ఆగ్రహం చేశారు. రాహుల్‌గాంధీపై ఈడీ విచారణ ముగిసేదాక దీక్షను కొనసాగిస్తామని ప్రకటించారు. దీక్షను బషీర్‌బాగ్ నుంచి గాంధీభవన్ ప్రాంగణానికి తరలించారు. రాహుల్‌గాంధీని ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలో రేవంత్ మాట్లాడారు. లాభాపేక్షలేని యంగ్ ఇండియా సంస్థలు ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ది పొందలేదన్నారు. మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కోర్టుకు వెళ్లినా... మనీలాండరింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తేల్చిందన్న విషయాన్ని గుర్తుచేశారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ ఆస్తుల్లో ఎలాంటి అవినీతి జరగలేదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయం బీజేపీకి పట్టుకుందన్నారు. అందుకే మూసేసిన కేసులో జాతీయ నాయకులకు నోటీసులిచ్చిందన్నారు. సాయంత్రం ఐదు గంటలకు విచారణ ముగించాల్సి ఉండగా 12 గంటలపాటు కొనసాగించారని విమర్శించారు. ఎంపీని ఇన్ని గంటలు ఎందుకు విచారణ చేయాల్సి వచ్చిందని మెడీని ప్రశ్నించారు. తల్లి ఆస్పత్రిలో ఉంటే...కొడుకును గంటల కొద్ది విచారణ పేరుతో ఉంచారని విమర్శించారు. ఇంత బరితెగింపు మంచిది కాదని మోడీని హెచ్చరించారు. దేశ భవిష్యత్తు కోసం తన రక్తాన్ని ధారపోయడానికి సిద్దమంటూ రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అంతకు అంత మిత్తితో సహా చెల్లిస్తామనీ, ఈ విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. బీజేపీ నేతలు చెప్పినట్టు వింటే, అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ 300 సీట్లతో అధికారంలోకి వస్తుందని చెప్పారు. తక్షణమే కేసును ఉపసంహరించుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరు మారకపోతే ఈనెల 23న ఢిల్లీలోని ఈడీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, బలరాంనాయక్, అనిల్‌కుమార్ యాదవ్, సునీతారావు తదిత రులు పాల్గొన్నారు. అనంతరం మోడీ సర్కారు దిష్టి బొమ్మ దహనం చేశారు.