Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమాజంలో వచ్చిన మార్పులు కమ్యూనిస్టులపై ప్రభావం కలిగిస్తాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. దానివల్ల కమ్యూనిస్టు చైతన్యం తగ్గే అవకాశముందన్నారు. అందుకే కార్యకర్తలకు నిరంతరం రాజకీయ విద్య అందించాలని అన్నారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అధ్యక్షతన సీపీఐ(ఎం) రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో రాజకీయ విద్య కీలకమనీ, ఇది కార్యాచరణ ద్వారానే కాక రాజకీయ పాఠశాలలో కొన్ని అంశాలు నేర్చుకోవడం ద్వారా సాధ్యమవుతుందని చెప్పారు. సమాజంలో వ్యక్తిగా సాధించలేని సమస్యలు అందరూ కలిసి సాధించగలరనీ, సమస్యలపై పోరాడుతున్న అనేకమందికీ కమ్యూనిస్టులకూ తేడా ఉందని అన్నారు. నూతన సమాజ ఏర్పాటుకు కమ్యూనిస్టులు పోరాడతారనీ, ఇది వర్గ పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని వివరింంచారు. ప్రపంచంలో కమ్యూనిస్టుల్లో సైద్ధాంతిక, రాజకీయ బలహీనతలు కొనసాగుతున్నాయని చెప్పారు. దీనివల్ల కమ్యూనిస్టుల్లో చీలికలు వచ్చాయన్నారు. అయినా కొన్ని పార్టీలు రివిజనిజం నుంచి బయటపడటంలేదని అన్నారు. అందుకే కమ్యూనిస్టులకు రాజకీయ విద్య నిరంతరం జరగాలని చెప్పారు. దీంతో కార్యకర్తలు పదునెక్కుతారనీ, లేదంటే రివిజనిజంవైపు పోతారని అన్నారు. ఈ రాజకీయ తరగతులు ఈనెల 18 వరకు జరుగుతాయన్నారు. ఈ తరగతులకు వివిధ జిల్లాల నుంచి జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రజారంగాల కార్యకర్తలు, పూర్తికాలం కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు డిజి నర్సింహారావు, మల్లు లకిë, రాష్ట్ర రాజకీయ విభాగం కన్వీనర్ బండారు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.