Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వాసితుల కోసమే పోరాటం
- మహిళలు ఒంటిపై గోర్లతో గీక్కున్నారని పోలీసులు చెప్పడం దారుణం
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తాము గౌరవెల్లి ప్రాజెక్టును అడ్డుకోవట్లేదనీ, నిర్వాసితులకు న్యాయం చేయాలనే తమ పోరాటమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ స్పష్టం చేశారు. నిర్వాసితులు, మహిళలు తమ ఒంటిపై గీక్కొన్నారే తప్ప తాము లాఠీచార్జి చేయలేదని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజెక్టును ఆమోదింపచేసి నాటి సీఎం వై.ఎస్.రాజశేఖర్‌తో శంకుస్థాపన చేయించడంలో ఆనాటి సీపీఐ ఫ్లోర్ లీడర్ చాడ వెంకట్ రెడ్డి ముఖ్యపాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ప్రాజెక్టు పరిధి పెంచి మంచి ప్యాకేజీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, భూమి ఇస్తామని హామీనిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటివరకూ దాన్ని నెరవేర్చలేదని విమర్శించారు. అదే సిద్ధిపేట జిల్లాలో కేసీఆర్ అత్తగారి ఊరు కుదురుపాకలో నిర్వాసితులకు మంచి ప్యాకేజీ ఇచ్చారనీ, గౌరవెల్లి నిర్వాసితులపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఎకరానికి రూ.30-40 లక్షల చొప్పున కట్టివ్వాలనీ, ఆనాడు 12 ఏండ్లు ఉన్నవారంతా నేడు మేజర్లయిన నేపథ్యంలో వారికీ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లాలో ప్రభుత్వ భూముల్లో పేదలు గుడిసెలు వేస్తే పోలీసులు వాటిని తగులబెట్టడం దారుణమని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర ఇన్చార్జి కార్యదర్శి పల్లావెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. గుడాటిపల్లిలో లాఠీచార్జి జరిగిందని రుజువు చేస్తూ పలు ఫొటోలను మీడియా ముందు ప్రదర్శించారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కింద ఈ ప్రాజెక్టు 1.7 టీఎంసీలుండగా, కేసీఆర్ దానిని కాళేశ్వరం పరిధిలోకి తీసుకువచ్చి 8 టీఎంసీలకు పెంచారని గుర్తుచేశారు. దీంతో నిర్మాణ వ్యయం రూ.36వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు పెరిగిందని, అందులో నిర్వాసితులకు ఇవ్వాల్సింది చాలా తక్కువ అయినప్పటికీ ఇవ్వడం లేదని విమర్శించారు. హన్మకొండలో పేదలు గుడిసెలు వేసుకోకపోతే ఇప్పటికే ఆ భూములు రియల్టర్ల కబ్జాకు గురయ్యేవనీ, ప్రభుత్వ భూమిని కాపాడినందుకు ప్రభుత్వం సీపీఐని అభినందించాలని కోరారు. సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందా పవన్ మాట్లాడుతూ.. సిద్ధిపేట జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు పూర్తి చేసినా, 2008లో వై.ఎస్.రాజశేఖర్ శంకుస్థాపన చేసిన గౌరవెల్లిని మాత్రం ఇంకా పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. గుడాటిపల్లి సహా 11 గ్రామాలకు తక్షణమే పరిహారం, పునరావాస ప్యాకేజీ ఇవ్వాలనీ, ఆ గ్రామస్తులపై లాఠీచార్జి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కనీసం హరీశ్‌రావు అయినా కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేయాలని కోరారు.