Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాయ్లెట్లను శుభ్రం చేస్తున్న ఉపాధ్యాయులు
- బడులను గాలికొదిలేసిన సర్కారు
- సర్వీసు పర్సన్లను నియమించని వైనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో సర్కారు బడులను ప్రభుత్వం గాలికొదిలేసిందన్న విమర్శలు వస్తున్నాయి. పారిశుధ్య కార్మికుల (సర్వీసు పర్సన్లు)ను నియమించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నది. దీంతో పాఠశాలల్లో పారిశుధ్యం సమస్య తీవ్రంగా ఉన్నది. అయితే ఉపాధ్యాయులే పారిశుధ్య కార్మికులుగా మారడం గమనార్హం. టారులెట్లను, పాఠశాలల ప్రాంగణాన్ని, తరగతి గదులను శుభ్రం చేయాల్సి వస్తున్నది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. దీంతో సోమవారం కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే 49 రోజుల తర్వాత పాఠశాలలు తెరవడంతో పారిశుధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. గ్రామపంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్లలో పనిచేసే పారిశుధ్య కార్మికుల సేవలను వినియోగించుకోవాలని ప్రధానోపాధ్యాయులను ప్రభుత్వం ఆదేశించింది. కానీ ప్రభుత్వ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. దీంతో వారెవరూ పాఠశాలలకు రావడం లేదు. అందువల్ల ఉపాధ్యాయులే పారిశుధ్యం పనులు చేయాల్సి వస్తున్నది. శ్రీశైలం డ్యాం (వెస్ట్) పాఠశాలలోని టాయిలెట్లు, తరగతి గదులు, వాటర్ ట్యాంక్‌ను ఉపాధ్యాయులే శుభ్రం చేశారు. అన్ని పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సర్వీసు పర్సన్లను నియమించాలని ఉపాధ్యాయ సంఘాల కోరుతున్నాయి.
బోధనేతర సిబ్బంది కరువు
రాష్ట్రంలోని 95 శాతం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది కరువయ్యారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ, భద్రత, రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణ, వేతన బిల్లుల తయారీ వంటి పనుల కోసం అవసరమైన కనీస బోధనేతర సిబ్బంది లేని పరిస్థితి ఉన్నది. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులే అన్ని పనులూ చేసుకోవాల్సి వస్తున్నది. దీంతో బోధనపై ఆ ప్రభావం పడుతున్నది. విద్యార్థులకు సకాలంలో సిలబస్ పూర్తి కాకపోవడం, నాణ్యమైన విద్య అందకపోవడం జరుగుతున్నది. ఇది విద్యాప్రమాణాలపైనా ప్రభావం చూపుతున్నది. ప్రతి పాఠశాలకూ స్వీపర్ కం వాచ్‌మెన్‌ను కేటాయించాలనీ, పారిశుద్ధ్య నిర్వహణ కోసం విద్యార్థుల సంఖ్యకనుగుణంగా స్వచ్ఛ కార్మికులను (సర్వీస్ పర్సన్స్) నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
89,856 మంది ప్రవేశం
బడిబాట కార్యక్రమంలో మంగళవారం 10,221 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో ఒకటో తరగతిలో ప్రవేశం పొందారని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో అంగన్వాడీ కేంద్రాల నుంచి 4,936 మంది, ప్రయివేటు స్కూళ్ల నుంచి 469 మంది, నేరుగా చేరిన వారు 1,466 మంది కలిపి మొత్తం 6,871 మంది చేరారని వివరించారు. రెండు నుంచి 12వ తరగతి వరకు మరో 3,137 మంది ప్రవేశం పొందారని తెలిపారు. ఇప్పటి వరకు సర్కారు బడుల్లో 89,856 మంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు.