Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం రద్దు చేయాలి:
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం.వాసుదేవ రెడ్డి
- కలెక్టరేట్ ఎదుట అఖిలపక్ష నాయకుల ధర్నా
నవతెలంగాణ-కరీంనగర్
తిమ్మాపూర్ మండలంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం రద్దు చేసి, అర్హులైన పేదలకు అప్పగించాలని సీపీఐ(ఎం) కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట అఖిలపక్ష నాయకులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి 2007లో పేదల కోసం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. రూ.200, దరావత్తు రూ.5వేలు తీసుకుని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్జీలు స్వీకరించారని తెలిపారు. కానీ వారికి ఇండ్లు ఇవ్వలేదన్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వం ఆ ఫ్లాట్లను బహిరంగ మార్కెట్లో వేలం పెట్టడం సిగ్గుచేటన్నారు. ఫ్లాట్లు రాని వారికి 15 సంవత్సరాల తర్వాత వారి డిపాజిట్ రూ.5వేలనే తిరిగి చెల్లించడం తీవ్ర అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి రాజీవ్ స్వగృహ ఇండ్ల వేలం పాటను రద్దుచేసి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాజీవ్ స్వగృహ అర్జీదారులకు న్యాయం జరిగే వరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ముకుందరెడ్డి, నాయకులు శనిగరపు రజినీకాంత్, కవ్వంపెల్లి అజరు, తిరుపతి, శ్రీకాంత్, రైకంటి శ్రీనివాస్, ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు.