Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డబ్బులిచ్చినోళ్లకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లా..
- ఎమ్మెల్యే గో బ్యాక్.. 'రెడ్యా'కు చేదు అనుభవం
- జయపురంలో గ్రామస్తుల ఆందోళన
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి, నర్సింహులపేట
'ఎమ్మెల్యే రెడ్యానాయక్ గో బ్యాక్' అంటూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధి నర్సింహులపేట మండలం జయపురం గ్రామస్తులు మంగళవారం అయన్ని అడ్డుకుని ఆందోళనకు దిగారు. గ్రామంలో పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిం చడానికి ఎమ్మెల్యే వెళ్లగా గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నాలుగేండ్లుగా పంపిణీ చేయకుండా కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించడానికి శంకుస్థాపన చేయడానికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను డబ్బులకే అమ్ముకోవడం పట్ల గ్రామస్తులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. పోలీస్ బందోబస్తు మధ్య గ్రామస్తులను నిలువరించి కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఎమ్మెల్యే రెడ్యానాయక్ వెళ్లిపోయారు.
గ్రామంలో 50 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి పూర్తి చేసి నేటికీ లబ్దిదారులకు పంపిణీ చేయలేదు. ఇప్పుడు మళ్లీ కొత్తగా డబుల్ బెడ ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో రెడ్యానాయక్ 'రెడ్ల'కేనా? నాయక్ అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఈక్రమంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ గో బ్యాక్ అంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గ్రామస్తులను నిలువరించే ప్రయత్నం చేయడంతో గ్రామస్తులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. జయపురం గ్రామంలోని ఇసుక మీద ఉన్న సోయి ఇండ్ల పంపిణీపై లేదని గ్రామస్తులు విమర్శించారు. అంగన్వాడీ భవనాలకు పక్కా భవనాలను నిర్మించలేదని, ఎస్సారెస్పీ కాలువ నిర్మాణాన్ని విస్మరించారని, క్రీడాకారులకు పుట్టినిల్లయిన జయపురానికి క్రీడా మైదానమే కరువైందని విమర్శించారు. ఎమ్మెల్యే మా ఊరుకు రావద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. డబుల్ ఇండ్లను సైతం అర్హులను కాదని అనర్హులకు అందచేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. డబ్బులిచ్చినోళ్లకే ఇండ్లను ఇస్తున్నారని విమర్శించారు. పోలీస్ బందోబస్తు నడుమ ఎమ్మెల్యే రెడ్యానాయక్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన సబ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన వారికి న్యాయం చేయడానికి మరో 50 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసామని, గ్రామంలోని సమస్యల పరిష్కారించి గ్రామస్తులకు న్యాయం చేస్తానని తెలిపారు.