Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో 72 కుల దురహంకార హత్యలు :
కేవీపీఎస్ రాష్ట్ర3వ మహాసభల లోగో ఆవిష్కరణలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ సర్కారు ఎనిమిదేండ్ల పాలనలో దళితుల జీవితాలు ఛిద్రమయ్యాయనీ, రాష్ట్రంలో 72 కుల దురహంకార హత్యలు జరిగాయని వక్తలు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెేవీపీఎస్) రాష్ట్ర మూడో మహాసభల లోగోను తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం(టీపీఎస్కే) కన్వీనర్ జి రాములు అవిష్కరించారు. మహాసభలకు విజయవంతానికి తమ వంతు కృషి చేస్తామనిపలు ప్రజాసంఘాల నాయకులు హామినిచ్చారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ జులై 23,24,25 తేదీల్లో సంగారెడ్డి పట్టణంలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 23న నీలిదండు కవాతుతో పాటు బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా కేరళ దేవాదాయ శాఖ మంత్రి దళిత్ సోషల్ ముక్తి మంచ్(డీఎస్ఎంఎం) జాతీయ అధ్యక్షులు కె రాధాకృష్ణన్, జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ రామచంద్ర డోమ్, జాతీయ నాయకులు బి వి రాఘవులు వి శ్రీనివాస రావు హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎంపిక కాబడిన 600మంది ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. రాబోయే మూడేండ్లలో చేపట్టబోయే సామాజిక ఉద్యమాలపై సమగ్రంగా చర్చించి పలు తీర్మాణాలను ఆమోదించనున్నట్టు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎనిమిదేండ్ల కాలంలో దళితుల జీవితాలను ఛిద్రం చేసిందన్నారు. దాడులు పెరిగాయని చెప్పారు. రాజ్యాంగం పలు సవాళ్ళను ఎదుర్కొన్నదన్నారు. మత ఘర్షణలు పెంచి, కుల, మత విద్వేషాలే తప్ప విధానాలు లేవని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ సామాజిక న్యాయాన్ని సమాధి చేసిందని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం రద్దు చేసిందని తెలిపారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళితులకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 72కులదురహంకార హత్యలు జరుగాయనీ, వాటిని అరికట్టడడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ మహాసభల ప్రాంగణానికి కులదురహంకారానికి బలైన మృతుల నగర్‌గా నామకరణం చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎం వి రమణ, ఎస్ ఎఫ్ ఐ, డీవై ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శులు టి నాగరాజు ఎం వెంకటేష్, ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శిఅడివయ్య, పీఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ్మ, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ సామెల్ డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, సాంబరాజు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.