Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి తన వైఖరిని బయటపెట్టకుండా గుంబనంగా ఉంటూ వస్తున్న అధికార టీఆర్ఎస్... ఆ ఎన్నికపై తటస్థ వైఖరిని అనుసరించనుందా..? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలపాలనే అంశంపై చర్చించేందుకు వీలుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీలో నిర్వహించిన భేటీకి టీఆర్ఎస్ డుమ్మా కొట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఇప్పుడు ఆ పార్టీ బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చేందుకే సమావేశానికి గైర్హాజరైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మొన్నటి దాకా ఫెడరల్ ఫ్రంట్, రాష్ట్రాల హక్కులు, బీజేపీని గద్దె దించాలనే నినాదాలు చేసిన గులాబీ పార్టీ... ఇప్పుడు జరగబోతున్న రాష్ట్రపతి ఎన్నికను ఉపయోగించుకుని కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేయొచ్చు కదా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్తో వేదిక పంచుకోబోమనే ఏకైక కారణంతో ప్రతిపక్ష పార్టీల సమావేశానికి గైర్హాజరయ్యారంటే... బీజేపీకి అనుకూలమా..? అనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎన్నికపై తటస్థ వైఖరిని అనుసరిస్తే పోతుందని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయాన్ని పార్టీ ముఖ్య నేతలకు ఇప్పటికే ఆయన తెలిపినట్టు వినికిడి. అయితే రాష్ట్రపతి ఎన్నికకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నందున ఇప్పుడప్పుడే ఈ నిర్ణయాన్ని బహిర్గతం చేయొద్దంటూ ఆయన నేతలను ఆదేశించారు. మరోవైపు ఈనెలాఖరులో ఢిల్లీకి వెళ్లి రావాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. అక్కడ మరికొంత మంది జాతీయ నేతలతో భేటీ కావటం ద్వారా రాష్ట్రపతి ఎన్నికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలూ లేకపోలేదని తెలంగాణ భవన్ వర్గాలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాయి.