Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
గౌరవెల్లి ప్రాజెక్టులో పారుతున్న నీళ్లు కాదని..నిర్వాసితుల రక్తమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ విమర్శించారు. కేసీఆర్‌కు అధికారం మహా అంటే ఆరు నెలలు, ఏడాదికి మించి ఉండదనీ, ఆ తర్వాత పిచ్చోడిగా రోడ్డుమీద పడి తిరిగే రోజు వస్తుందని అన్నారు. బుధవారం రాజ్‌భవన్‌లో బండి సంజరు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవెల్లి నిర్వాసితులు, బాసర విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజెక్టు రభస 12 ఏండ్లుగా కొనసాగుతున్నదనీ, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వడం లేదని చెప్పారు. పంజాబ్‌లో ఇచ్చిన డబ్బులు గౌరవెల్లి నిర్వాసితులకు ఇచ్చేస్తే అయిపోయేదిగదా అని ప్రశ్నించారు. ఎన్జీటి అనుమతి లేకుండా పనులు చేపడుతున్నారని ఆరోపించారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా 300 దాకా పోలీసులు లాఠీచార్జికి పూనుకోవడం దారుణమన్నారు. మహిళలను గిచ్చి, కొరికి అసభ్య పదజాలంతో పోలీసులు దూషించడం అన్యాయమన్నారు. ప్రగతి భవన్, స్థానిక ఎమ్మెల్యే మెసేజ్‌తోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. పోలీసులపై దాడి చేసిన టీఆరెస్ నాయకులపై కాకుండా ప్రజలపై ఎందుకు కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. సర్పంచ్, ఉప సర్పంచ్ లకు కొట్లాట పెట్టి ఊ అంటే సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు ఇస్తానన్న రూ.15 లక్షల ప్రోత్సాహకం ఏమైందని ప్రశ్నించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయించుకుని బిల్లులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాసర ఐఐఐటీలో వీసీ లేడనీ, పురుగుల అన్నం, నీళ్లచారు తినలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. కనీస సౌకర్యాలు లేకుండా ఉన్నత చదువులు ఎలా సాగుతాయని ప్రశ్నించారు. మంత్రిని పంపితావో... నువ్వే పోతావో పో.. వెళ్లి వర్సిటీ పరిస్థితి చూసి సమస్యలను పరిష్కారించాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు.