Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఇంటర్ విద్యాపరిరక్షణ సమితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంలో ఇంటర్ విద్యా కమిషనరేట్ అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) విమర్శించింది. దీనికి నిరసనగా శుక్ర, శనివారాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని నిర్ణయించింది. ఈ మేరకు టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, నగేష్, సమన్వయకర్త మైలారం జంగయ్య బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణ కోసం జీవో నెంబర్ 16ను జారీ చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీలోనూ క్రమబద్ధీకరణ చేస్తామంటూ ప్రకటించారని తెలిపారు. అందుకనుగుణంగా మార్చిలో ఆర్థిక, ఉన్నత విద్యాశాఖలు కాంట్రాక్టు అధ్యాపకుల జాబితా గురించి ఇంటర్ విద్యా కమిషనర్‌కు వివరాలు పంపాలంటూ లేఖలు రాశాయని పేర్కొన్నారు. ఇంతవరకూ క్రకమబద్ధీకరణ జాబితాను ప్రభుత్వానికి పంపకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. దీనికి నిరసనగా కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆవేదన సభను వేలాది మందితో మంగళవారం నిర్వహించామని గుర్తు చేశారు. అయినా అధికారుల నుంచి స్పందన రాలేదని తెలిపారు. అందుకే శుక్ర, శనివారాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలియజేస్తామని వివరించారు. ఇప్పటికైనా జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న జనరల్, ఒకేషనల్ కాంట్రాక్ట్ అధ్యాపకులందరి క్రమబద్ధీకరణ జాబితాను వెంటనే ప్రభుత్వాన్ని పంపించాలని కోరారు.