Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో ఆ విద్యాసంస్థను సందర్శిస్తాం
- ఆందోళన బాట పట్టకుండా తరగతులకు హాజరుకండి:
మంత్రులు సబిత, ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రతిభ కలిగిన వేలాది మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలోని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రులు పి సబితా ఇంద్రారెడ్డి, ఎ ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన బాటపట్టకుండా తరగతులకు హాజరు కావాలని కోరారు. బుధవారం హైదరాబాద్ లో విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారులతో మంత్రులు సమావేశమయ్యారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు పేర్కొన్న సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్‌ను ఆర్జీయూకేటీకి పంపించామని వివరించారు. అత్యవ సరం అనుకున్న సమస్యలను సత్వరమే పరిష్కరిం చాలంటూ కలెక్టర్‌కు సూచించామని తెలిపారు. మిగిలిన సమస్యలనూ ప్రాధాన్యతా పరంగా పరిష్క రించాలని ఇంఛార్జీ వీసీకి సూచించామని పేర్కొ న్నారు. ఆర్జీయూకేటీ విద్యాలయంలో విద్యా ప్రమా ణాలను పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. త్వరలోనే మంత్రులుగా ఆ విద్యాల యాన్ని సందర్శిస్తామని వివరించారు. విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు. ఈ విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విద్యార్థులంతా తరగతులకు హాజరుకావాలని సూచించారు. వారి సమస్యలను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విద్యావిషయాల్లో రాజకీయం చేయడం తగదని పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంఛార్జీ వీసీ రాహుల్ బొజ్జ తదితరులు పాల్గొన్నారు.