Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిర్‌ఫోర్స్ అకాడమీ ఎయిర్ మార్షల్ చంద్రశేఖర్ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర రక్షణ శాఖ త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి ప్రకటించిన 'అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్' దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్‌ను మరో వారం రోజుల్లో విడుదల చేస్తామని ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కమాండెంట్ ఎయిర్ మార్షల్ బీ చంద్రశేఖర్ వెల్లడించారు. కేవలం నాలుగేండ్ల కాలపరిమితితో పనిచేసేందుకు టెన్త్, ఇంటర్ చదివిన పదిహేడున్నరేండ్ల నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువకులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. త్రివిధ దళాల్లో యువత భాగస్వామ్యం పెంచే పేరుతో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఇటీవల ఈ స్కీంను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. నాలుగేండ్ల తర్వాత తమ భవిష్యత్ ఏంటని ఇప్పటికే దేశవ్యాప్తంగా యువకులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కమాండెంట్ బీ చంద్రశేఖర్ సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్లో ఎయిర్ వైస్ మార్షల్ కేఎస్కే సురేష్, గ్రూప్ కెప్టెన్ వికాస్వాహితో కలిసి విలేకరుల సమావేశంలో 'అగ్నిపథ్' వివరాలు వెల్లడించారు. ఈ స్కీం క్రింద రిక్రూట్ అయిన యువకులకు నాలుగేండ్ల తర్వాత మాజీ సైనికుల తరహాలో పెన్షన్, క్యాంటీన్ వంటి ఎలాంటి సౌకర్యాలు ఉండబోవన్నా రు. కేవలం నాలుగేండ్ల వరకే తాము వారికి శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు ఇస్తామనీ, ఆ సమయంలో మొదటి సంవత్సరం రూ.4.76 లక్షల వార్షిక ప్యాకేజీ ఇస్తామనీ, అది నాలుగో సంవత్సరం నాటికి రూ.6.92 లక్షలకు పెరుగుతుందని వివరించారు. ఇవి కాకుండా రూ.48 లక్షల ఇన్సూరెన్స్, రూ.44 లక్షల డెత్ ఎక్స్‌గ్రేషియా వంటివి ఉంటాయని తెలిపారు. నాలుగేండ్ల సర్వీసు ముగిసిన తర్వాత యువతకు రూ.11.7 లక్షలను సేవా నిధి రూపంలో ఇస్తామన్నారు. నాలుగేండ్ల తర్వాత శక్తిసామర్థ్యాల్లో మెరిట్ సాధించిన వారి నుంచి 25 శాతం మందిని మాత్రమే వివిధ విభాగాల్లోకి తీసుకుంటామన్నారు. అయితే భవిష్యత్‌లో ఈ స్కీంలో పలు మార్పులు జరగొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అగ్నిపథ్ రిక్రూట్మెంట్లో ఎలాంటి మినహాయింపులు ఉండబోవనీ, రెగ్యులర్ పద్ధతిలోనే ఉంటాయని చెప్పారు. వారం రోజుల్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇస్తామనీ, 90 రోజుల గడువుతో ఆన్లైన్ పరీక్ష ఉంటుందనీ, దానిలో అర్హత సాధించిన వారికి శారీరక దేహదారుఢ్య పరీక్షలు ఉంటాయని వివరించారు. తొలి బ్యాచ్ 2023 జూన్, జులై నాటికి అందుబాటులోకి వస్తుందనీ, దేశవ్యాప్తంగా 46 వేల మందిని రిక్రూట్ చేసుకుంటామని తెలిపారు. నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేసుకొని బయటకు వచ్చే యువకులకు వారి అర్హత, శక్తి సామర్థ్యాలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పలు కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. త్రివిధ దళాల్లో చేరాలనే ఆసక్తి ఉన్న యువకులు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు.