Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నించే పార్టీలపై నియంతలా వ్యవహారం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
- మందమర్రి లెదర్పార్కు భూమిని రక్షించాలని డిమాండ్
నవతెలంగాణ- తాండూర్, మందమర్రిరూరల్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ప్రజల స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాజ్యాంగ హక్కులుగా పరిగణించే లౌకిక, ప్రజాస్వామ్య, ఆర్థిక, సామాజిక న్యాయాలను మరిచి కుల, మతాలను ప్రోత్సహిస్తూ పబ్బం గడుపుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంచిర్యాల, కుమురంభీం జిల్లాల సీపీఐ(ఎం) విస్తృత స్థాయి సమావేశాన్ని బెల్లంపల్లి పట్టణంలోని టీసీఓఏ క్లబ్లో నిర్వహించారు. కనికారపు అశోక్, దుర్గం దినకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. ప్రభుత్వ కార్యకలాపాలల్లో మత ప్రమేయం ఉండకూడదనే లౌకిక సామ్యవాదాన్ని బీజేపీ తుంగలో తొక్కి అగ్రవర్ణాల కోసం చట్టాలు చేస్తోందన్నారు. ఆర్థిక, సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేటర్లకు విక్రయించే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం పట్ల ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తోందని తెలిపారు. మహిళలపై లైంగికదాడుల నివారణకు కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం స్త్రీ స్వేచ్ఛ పట్ల నిబంధనలు విధించేలా ప్రకటనలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిపై రాజద్రోహ చట్టాలను ఉపయోగించి అణగదొక్కుతోందన్నారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను బీజేపీ ప్రభుత్వం తమ ఆధీనంలో ఉంచుకొని ప్రశ్నించే రాజకీయ పార్టీలపై నియంతలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే కమ్యూనిస్టు పార్టీలను ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తారని చెప్పారు. ప్రజా ఉద్యమాల్లో సీపీఐ(ఎం) కార్యకర్తలు ముందు వరుసలో ఉండాలని పిలుపునిచ్చారు.
లెదర్పార్కు భూమిని సంరక్షించాలి
మందమర్రి పట్టణంలో ఏర్పాటు చేయనున్న లెదర్పార్కు భూమి ఆక్రమణకు గురికాకుండా ప్రభుత్వం సంరక్షించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. లెదర్పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. 2009లో లెదర్ ఫ్యాక్టరీకి స్థలం కేటాయించి వదిలేశారని, వెంటనే దాని ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పట్లో 300మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తయిందని చెప్పారు. లెదర్పార్కు కోసం కేటాయించిన 25 ఎకరాల భూమిని ప్రస్తుతం ఇతర అవసరాలకు కేటాయిస్తున్నారన్నారు. ఇందులో సుమారు 5 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటోందని వివరించారు. ప్రభుత్వం తక్షణమే ఈ భూమిని సంరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ పరిశ్రమను ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ దృష్టి సారించాలని కోరారు. ఈ అంశంపై ప్రభుత్వానికి లేఖ రాస్తామని, కార్మికులు, దళితులు నిరుత్సాహానికి గురికాకూడదని సూచించారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, పి.ఆశయ్య, తొడసం భీంరావు, రాష్ట్ర నాయకులు బి.మధు, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల కార్యదర్శులు సంకె రవి, కె.రాజన్న, కార్యదర్శివర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దాసరి రాజేశ్వరి, గోమాస ప్రకాష్, ఎర్మ పున్నం పాల్గొన్నారు.