Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిద్రమత్తు దిగలేదా? అంటూ పోలీసులు బూతులు తింటారు
- అర్ధరాత్రి కాలయముల్లా విరుచుకుపడ్డారు
- ఇల్లు, కనీసం గుడిసె వేసుకునేందుకు సర్కార్ జాగ చూపలే!
- సీఎం ఇలాకాలో సకల సదుపాయాలూ.. మాకేమో మన్నా?
- కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 'గౌరవెళ్లి' నిర్వాసితుల గోడు
- బాధితులకు వామపక్ష నేతల బాసట
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
అర్ధరాత్రి ఇండ్లలోకి చొరబడ్డారు. నిద్రమత్తు దిగలేదా? అంటూ మొఖంపైనే పిడిగుద్దులు కురిపించారు. లాఠీలు, కర్రలతో చితకబాదారు. రోడ్డుమీదకు పరిగెత్తితే దొరికిన పైపులు, కర్రలతో చావబాదారు. సర్వం కోల్పోయిన మాపై కనీసం కనికరం లేని సర్కారు.. ఉండేందుకు ఇల్లు ఇవ్వకుండా, కనీసం గుడిసె వేసుకునేందుకు జాగా ఇవ్వకుండా అర్ధరాత్రి సుమారు 500 బంది ఖాకీలను కాలయముల్లా దింపి మమ్ములను చావబాదింది' అంటూ కరీంనగర్‌లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెళ్లి ప్రాజెక్టు నిర్వాసితులు 'నవతెలంగాణ'తో గోడు వెళ్లబోసుకున్నారు. ఎవరిని కదిలించినా గుండెలవిసేలా రోదిస్తూ తమ నిస్సహాయతను వెలిబుచ్చారు. అందులో కొన్ని వారి మాటల్లోనే..
'ఇంట్లో ఉన్న నా కొడుకును పోలీసోళ్లు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. నా కడుపుల తన్నంగనే లేవచేతగాలేదు. ఏడ్చుకుంటూ మెల్లగా బయటకు వచ్చేసరికి వాడంతా రణరంగమైంది' అంటూ గుటాటిపల్లివాసి నోముల అనిత ఏడ్చిఏడ్చి బొంగురుపోయిన గొంతుతో బాధను చెప్పింది. ఆమె పక్కనే చికిత్స పొందుతున్న అదే గ్రామానికి చెందిన మరో బాధితురాలు నోముల స్వరూప మాట్లాడుతూ.. 'నా రెక్కలు విరిచి ఇంట్లోకెళ్లి బయటకు లాగారు. ఎంత ఏడ్చినా కనికరించకుండా లాఠీలతో కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక స్పృహతప్పిపోయా. నా కొడుకు, బిడ్డలు ఈ కరీంనగర్ ఆస్పత్రికి తీసుకొచ్చిండ్రు' అంటూ వాపోయింది. ఇలా చికిత్స పొందుతున్న నిర్వాసితుల్లో ఎవరిని కదిలించినా ఒక్కొక్కరూ తమ గోడును చెప్పుకున్నారు.
రిజర్వాయర్ సామర్థ్యం పెంపుతోనే సమస్య..
గౌరవెళ్లిని పెద్దచెరువును చిన్న రిజయర్వాయర్గా మార్చాలని 2009లో అప్పటి ప్రభుత్వం 1.8టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు డిజైన్ చేసింది. రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ సర్కారు ఆ రిజర్వాయర్‌ను రీడిజైన్ చేసి 8.3టీఎంసీల సామర్థ్యానికి పెంచింది. దీంతో ముంపు ప్రాంతం పెరిగి నిర్వాసితులూ పెరిగారు. ఏకంగా 3870 ఎకరాలు రైతుల నుంచే సేకరించాల్సి వచ్చింది. అయితే, తొలుత ప్రాజెక్టు డిజైన్ చేసిన సమయంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు అప్పటి సర్కారు ఎకరాకు రూ.2.10లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. ఆ డబ్బులతో ప్రాజెక్టు పైభాగంలో భూములు కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచడంతో ఆ భూములూ కోల్పోవాల్సి వచ్చింది. అయితే, గతంలో ఇచ్చిన పరిహారంతోనే భూములు దొరకని పరిస్థితి నెలకొనగా.. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఏకంగా ఎకరా రూ.30లక్షల వరకు పలుకుతుండటం, సర్కారు ఇచ్చే పరిహారం అందులో సగం కూడా లేకపోవడం వారిని మానసికంగా కుంగదీస్తోంది. ఇదంతా ఒకెత్తయితే.. వారికి ఇంతవరకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదు. కనీసం ఇండ్ల స్థలాలూ ఇవ్వలేదు. డబుల్బెడ్రూమ్ ఇండ్లూ చూపలేదు. రిజర్వాయర్‌లో ట్రయల్‌రన్ పేరుతో రాత్రికి రాత్రే సుమారు 400 మంది పోలీసుబలగాలు గుడాటిపల్లిని చుట్టుముట్టి వెళ్లగొట్టడమే రణరంగానికి దారి తీసింది.
ఒక్కొక్కరిదీ ఒక్కో గోడు...
8 గుటాటిపల్లికి చెందిన నోముల అనిత తన పది ఎకరాల్లో 8 ఎకరాలు గౌరవెల్లి ప్రాజెక్టు పనుల ప్రారంభంలోనే 2009లో కోల్పోయింది. తరువాత ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచగా ఉన్న మరో రెండెకరాల భూమీ పోయింది. మొదట్లో ఎకరాకు ఇచ్చిన రూ.2.10లక్షలతో కనీసం మరో ఎకరం భూమి రాలేదు సరికదా ఇప్పుడు చుట్టుపక్కల రూ.30లక్షలకుపైగా పలుకుతోందని బోరున విలపించారు. 8 ఇదే గ్రామానికి చెందిన నల్ల అనసూయ 10 ఎకరాల భూమి 12ఏండ్ల కిందట ప్రాజెక్టు కింద కోల్పోయింది. ఎకరాకు రూ.2.10లక్షల చొప్పున వచ్చిన పరిహారంతో ప్రాజెక్టు పైభాగంలోని గ్రామంలో 5 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇప్పుడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచడంతో మళ్లీ కొనుక్కున్న భూమినీ కోల్పోవాల్సి వచ్చింది. వ్యవసాయం తప్ప మరే పనీ తెలువని అనసూయ, ఆమె కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. 'ప్రభుత్వం మాకు కనీసం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదు. బతికేందుకు ఉపాధీ చూపలేదు. ఉండేందుకు గూడు ఇవ్వలేదు. సర్కారోళ్లు మా బతుకుల్లో మన్నుపోసిండ్రు. మా బతుకులు ఆగం చేసిండ్రు' అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చింది.
8'కొండపోచమ్మ సాగర్ కింద భూములు కోల్పోయిన వారికి 2013యాక్ట్ ప్రకారం పరిహారం చెల్లించారు. పైగా 18ఏండ్లు నిండిన వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.8లక్షల చొప్పున ఇచ్చారు. కుటుంబానికి 200 గజాల స్థలాన్ని ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లనూ కేటాయించారు. అది సీఎం కేసీఆర్ నియోజకవర్గం కావడంతో సకల సదుపాయాలూ కల్పించారు. మాకేమో చేతిల మన్నుపోసి రోడ్డున పడేశారు' అంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెప్పుకొచ్చారు. బుధవారం ఆస్పత్రుల్లో వామపక్ష పార్టీల నేతలు పరామర్శించి, బాసటా ఉంటామని భరోసా ఇచ్చారు.
నిర్వాసితులకు అండగా ఎర్రజెండా
నిర్వాసితులపై టీఆర్ఎస్ గుండాలు, పోలీసులు దాడి చేయడం పనికిమాలిన చర్య. వారిని కఠినంగా శిక్షించాలి. ప్రాజెక్టు నిర్వాసితుల త్యాగం వెలకట్ట లేనిది. ప్రాజెక్టులు దేవాలయాలు, నిర్వాసితులు దేవుళ్లు అంటూ కీర్తించే సీఎం కేసీఆర్ ఆ ఘటనపై నైతిక బాధ్యత వహించాలి. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతోనే మెరుగైన వైద్యం అందించాలి.
- మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ(ఎం) కరీంనగర్ జిల్లా కార్యదర్శి