Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌరవెల్లి భూ నిర్వాసితులకు సంఘీభావం తెలిపిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి , సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
నవతెలంగాణ-అక్కన్నపేట
గౌరవెల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకపోగా.. వారిపై పోలీసులు, టీఆర్ఎస్ నాయకులు గూండాల్లా దాడి చేయడం దారుణమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులు మూడు రోజులుగా నిరసన దీక్ష చేపట్టిన భూనిర్వాసితుల శిబిరాన్ని చెరుపల్లి, నారాయణ బుధవారం పరామర్శించి వారి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గౌరవెళ్లి ప్రాజెక్ట్ కట్ట మీదనే కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. పోలీసులు దొంగల్లాగా వెళ్లి.. రాత్రిపూట కరెంట్ కట్ చేసి ప్రభుత్వానికి భూములు దానం చేసిన పేద వాళ్లపై దాడి చేయడం దారుణమన్నారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తల గుండాగిరికి రక్షణగా ఉండటం సిగ్గుచేటన్నారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే.. పోలీసులు టీఆర్ఎస్కు గులాంగిరి చేస్తున్నట్టుగా కనిపిస్తోందన్నారు. అసలు ఇలాంటి వ్యవస్థ ఒక గౌరవెల్లి ప్రాజెక్టు విషయంలోనే కాకుండా రాష్ట్రమంతా కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దారుణంగా తయారైం దన్నారు. కనీసం ప్రజల్లో తిరగాలంటేనే పోలీసుల పహారా లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన ఎమ్మెల్యేలే ఇసుక దందాల్లో, భూకబ్జాలు, మద్యం మాఫియా చేస్తూ అరాచకాలకు ఎగబడుతున్నారని ఆరోపించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి సన్ని హితుడిగా ఉంటూ పేదలపై ఉక్కుపాదం మోపుతు న్నారని అన్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే పేదవారిని చిత్రహింసలు చేస్తున్న ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని తెలిపారు. భూనిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. పేదలకు ఎప్పుడూ సీపీఐ(ఎం) అండగా ఉంటుందన్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. భూనిర్వాసి తుల పోరాటానికి ఎర్రజెండా మద్దతు ఎప్పుడూ ఉంటుం దన్నారు. ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని నిర్వాసితులకు భరోసా కల్పించారు. గతంలో సీఎం కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను నేనే స్వయంగా కుర్చీ వేసుకుని పూర్తి చేస్తామని మాట ఇచ్చి నేటికీ పూర్తి చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. ముందుగా పోలీసుల దాడిలో గాయపడిన మహిళలను కరీంనగర్ ఆస్పత్రిలో పరామర్శించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అముదాల మల్లారెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు నక్కల యాదవ రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్, షఫీ, సీపీఐ రాష్ట్ర ఇన్చార్జి సెక్రటరీ పల్లా వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపే మల్లేష్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కేదారి, గౌరవెల్లి గ్రామ ఉపసర్పంచ్ కొమ్ముల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.