Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాలిలో శాంతి భద్రతలు
- లైంగికదాడుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి
- మూడు వారాల్లో దోషులకు శిక్ష పడాలి: రాజకీయ పార్టీల నేతల డిమాండ్
- కేసీఆర్ పెద్ద నేరగాడు : రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఆడపిల్లను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే రోజులు దాపురించాయని పలువురు రాజకీయ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ శాంతిభద్రతలను గాలికొదిలేశారని విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో సర్కారు, పోలీసులు విఫలమవు తున్నారని ఆరోపించారు. బాలికలు, మహిళలపై కొనసాగుతున్న దాడులను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలనీ, మూడు వారాల్లో దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాంత్రిభద్రతలకు సంబంధించిన 32 అంశాలపై తీర్మానాన్ని ఆమోదించారు. మద్య నియంత్రణ కోసం భారీ ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం సోమాజిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. దీనికి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ దేవాలయంలో జరిగిందని పీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. రేప్ ఎక్కడ జరిగిందనే విషయాన్ని పోలీసులు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. దేవుడినే రాజకీయాలకు వాడుకునే బీజేపీ కూడా దీనిపై మాట్లాడడం లేదని విమర్శించారు. ఒప్పందంలో భాగంగానే గ్యాంగ్ రేప్ ఘటన వీడియోను బీజేపీ ఎమ్మెల్యే బయటపెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో పిల్లలను మిట్టమధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు పంపే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి మద్యం అమ్ముతున్నారని విమర్శించారు. శాంత్రిభద్రతలు దారి తప్పాయన్నారు. తాము అధికారంలోకి వచ్చినా, రాకపోయినా తెలంగాణ బాగుండాలనే దానిపై ఆలోచిస్తున్నట్టు తెలిపారు. నలుగురు అధికారులకు రెండు నుంచి నాలుగు బాధ్యతలు అప్పగించారనీ, మరోవైపు సమర్థవంతమైన ఐపీఎస్‌లకు పోసస్టింగ్ లు లేక ఖాళీగా కూర్చొబెట్టారని గుర్తు చేశారు. నచ్చినవాళ్లకు నజరానా...నచ్చనివాళ్లకు జరిమానా అన్నట్టు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చెప్పుచేతల్లో ఉండే అధికారులకు ఐదు శాఖలు ఇచ్చి మిగతా వారినే ఊరికే కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు. రిటైర్డ్ అయిన వారికి రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చారని విమర్శించారు. సమర్థులను పక్కనపెట్టి సామాజిక కోణాల్లో పోస్టింగ్‌లు ఇస్తున్నారని మండిపడ్డారు. పాలనా వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకుని శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్న సీఎం కేసీఆర్ పెద్ద నేరగాడని విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఘటన దారుణమనీ దీనిపై సీఎం మౌనం సరైంది కాదని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు.ఆయనకు తన భద్రతపై ఉన్న శ్రద్ధ మహిళల రక్షణపై లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని చెప్పారు. తాగుడును నియంత్రించాలని డిమాండ్ చేశారు. పురుషాధిక్యత అనేది మహిళా హక్కులకు ప్రమాదకరి అనీ, మహిళల సమస్యలపై ఎనిమిదేండ్లుగా ఒక సమీక్ష కూడా జరగలేదన్నారు. చివరిసారిగా రోశయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిందని గుర్తు చేశారు. ఈ అంశాలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీలు, సభలు నిర్వహించాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని విమర్శించారు. అఖిలపక్ష ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సూచించారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న నేరాలను నియంత్రించకుండా సమాజంలో నేరాలు ఆగవన్నారు. రాష్ట్రం వస్తే తెలంగాణ ఉన్నతమైన సమాజంగా అవతరిస్తుందని ఆశించామనీ, కానీ రేప్‌లు, అత్యాచారాలు, తల్లిదండ్రులే పిల్లల్ని చంపడం లాంటి ఘటనలు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని విద్వంసం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ తెలంగాణపార్టీ నేత తూడి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ అబద్ధాలను అందంగా ఎలా చెప్పొచ్చనే విషయాన్ని కేసీఆర్ చూపిస్తున్నారనీ, అబద్ధాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె గీతారెడ్డి మాట్లాడుతూ దిశా నిందితులకు ఒక న్యాయం, జూబ్లీహిల్స్ ఘటనలో ఒక న్యాయమా అని ప్రశ్నించారు. పొలిటికల్ బాస్‌కు పోలీసులు తొత్తులు అయిపోయారన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ గౌరవెల్లిలో తమ భూములకు పరిహారం ఇవ్వాలంటూ నిరసన తెలిపిన ప్రజలపై తలల పగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ బుల్డోజర్స్ రాష్ట్ర సమితిగా మారబోతుందన్నారు. సీపీఐ (ఎంఎల్ న్యూడెమెక్రసీ నేత సాధినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఖునీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ సెర్చ్ కమిటీ చైర్ పర్సన్ ఇందిరాశోభన్ మాట్లాడుతూ తెలంగాణాలో పోరాట స్ఫూర్తిని కేసీఆర్ చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగికదాడులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేయాలని కోరారు. బీఎస్పీ నాయకులు దయానందరావు, జ్యోతి మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని సీఎం కేసీఆర్ దెబ్బతిస్తున్నారని విమర్శించారు. సామాజిక న్యాయ సాధన దిశగా కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు రవి, టీడీపీ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్య, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్, పీవోడ్య్లు నేత ఝాన్సీ, కాంగ్రెస్ నేతలు బెల్లయ్యనాయక్, సునీతారావు, చిన్నారెడ్డి, వైసీపీటీపీ నేత సత్యవతి, మహిళా సమాఖ్య నేత విజయలక్ష్మిపండిత్తోపాటు వివిధ ప్రజాసంఘాలు, సామాజిక సంఘాలకు చెందిన నేతలు పాల్గొన్నారు.
ఏఐసీసీ నేతలపై దాడికి నిరసనగా నేడు రాజ్‌భవన్ వద్ద ఆందోళన
ఏఐసీసీ నేతలపై బీజేపీ సర్కారు దాడికి నిరసనగా రాష్ట్రంలో ఆందోళనలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.ఇందులో భాగంగా గురువారం రాజ్‌భవన్ వద్ద నిరసన తెలపనున్నట్టు చెప్పారు. శుక్రవారం అన్ని జిల్లాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమిత్‌షా తీరుపై ఢిల్లీ నుంచి గల్లీదాకా ఆందోళనలు చేపడుతామన్నారు. ఢిల్లీలో జరిగిన ఆందోళనలో కేసీ వేణుగోపాల్, పి చిదంబరంనకు గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాత్, భూపేష్‌పై పొలీసులు దాడులు చేశారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియాగాంధీని అవమానిస్తున్న మోడీ చర్యలు సరైనవి కావన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు అవమానకర మన్నారు. గాంధీ కుటుంబాన్ని, దేశాన్ని విడదీసి చూడలేమని చెప్పా రు. గురువార ఉదయం 10 గంటలకు ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఉన్న పీజేఆర్ విగ్రహం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకోవాలనీ, అక్కడి నుంచి రాజ్ భవన్ వరకు భారీ నిరసన ప్రదర్శన ఉంటుందని తెలిపారు. జిల్లాల్లో రైల్వేస్టేషన్లు, పోస్టాఫీస్్లు,ఎల్ఐసీ, టెలికాం, ఇన్‌కాం టాక్స్ ఆఫీస్‌ల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని కోరారు. మోడీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారారని విమర్శించారు. రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. ఆయన సొంతంగా రాష్ట్రపతి అభ్యర్థిని పెడతాడా? అని ప్రశ్నించారు. మమత బెనర్జీ పిలిచిన సమావేశానికి కేసీఆర్ ఎందుకు పోలేదని ప్రశ్నించారు.
రాహుల్ పాదయాత్ర ప్రకటనతో బీజేపీ నేతలకు వణుకు
మూడోరోజు దీక్షలో జగ్గారెడ్డి
కాంగ్రెస్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక కేంద్ర ప్రభుత్వం ఈడీిని ఉసిగొల్పుతున్నదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రాహుల్‌గాంధీ దేశవ్యాప్త పాదయాత్రతో బీజేపీని నిలదీయడానికి సిద్దం అయ్యారనీ, దీంతో బీజేపీకి వణుకు మొదలైందని చెప్పారు. హైదరాబాద్‌లో కొనసాగుతున్న దీక్షలో బుధవారం ఆయన మాట్లాడారు. పాదయాత్ర చేయకుండా అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని చెప్పారు. పాదయాత్ర చేస్తే మోడీ పేదవారికి ఇస్తానన్న రూ 15 లక్షలు ఎందుకు ఇవ్వలేదని రాహుల్ ప్రశ్నిస్తారని గుర్తు చేశారు. పెట్రోల్, డీజల్, గ్యాస్, నిత్యావసర ధరలు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం తదితర అంశాలు చర్చకు వస్తాయన్నారు. ఈనేపథ్యంలో సోనియా, రాహుల్‌గాంధీని ప్రజలకు దూరంగా ఉంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఏఐసీసీ కార్యాలయంలోకి పోలీస్‌లు చొరబడి దాడి చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. దీక్షలో అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి, పార్టీ నేత అంజన్‌కుమార్, మల్లు రవి, మల్రెడ్డి రంగారెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ప్రీతం తదితరులు పాల్గొన్నారు.