Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం డాక్టర్ల ఇబ్బందులు ొ టెంట్ కిందే ఎదురుచూపులు...
- భవనం కేటాయించాలంటూ కోరుతున్న తెలంగాణ వైద్యులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర్ల రిజిస్ట్రేషన్, రెన్యువల్ తదితర అవసరాలతో పాటు నకిలీ వైద్యుల ఆట కట్టించాల్సిన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌కు కార్యాలయం కరువైంది. కోఠిలోని వైద్య, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయ భవన సముదాయాల్లో అందుబాటులో భవనాలు ఉన్నప్పటికీ ఒక మూలన, గుహ మాదిరిగా ఉన్న రేకుల షెడ్డులోనే కొనసాగిస్తున్నారు. రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం వచ్చే డాక్టర్లకు వెయిటింగ్ హాల్ లేకపోవడంతో బయట వేసిన టెంటు కిందే వారు ఎదురు చూడాల్సిన పరిస్థితి. జాతీయ స్థాయిలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉన్నట్టే రాష్ట్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పని చేస్తున్నది. కౌన్సిల్లో చైర్మెన్, వైస్ చైర్మెన్ సహా ఆరుగురు సభ్యులున్నారు. ప్రయివేటు వైద్యుల ప్రాక్టీసులను నియంత్రించడం, నకిలీ వైద్యులు, ఆస్పత్రులపై వచ్చే ఫిర్యాదులను విచారించడం తదితర పనులను కౌన్సిల్ నిర్వహిస్తున్నది. అక్రమాలు తేలితే పోలీసులకు ఫిర్యాదు చేయడం, చర్యలకు సిఫారసు చేసే అధికారం దానికి ఉంది. ప్రయివేటు ప్రాక్టీసు నిర్వహించే వైద్యులు తప్పనిసరిగా ఈ కౌన్సిల్లో తమ పేరును, ఆస్పత్రి పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆస్పత్రులను నడిపిస్తామంటే కుదరదు. అవసరం లేకున్నా శస్త్ర చికిత్సలు, అధిక ఫీజులు వసూలు చేసే ప్రయివేటు ఆస్పత్రులు, డాక్టర్లపై రోగులు కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయొచ్చు. వాటిని విచారించాక అక్రమాలు తేలితే ఆ వైద్యుడి ప్రాక్టీసుపై నిషేధం విధిస్తుంది. ఇంతటి కీలకమైన కౌన్సిల్‌కు సరైన కార్యాలయం లేకపోవడం విమర్శలకు తావిస్తున్నది. కొద్ది రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో టెంటు కింద వెయిట్ చేయడం కూడా సాధ్యం కాదు. కింద కనీసం ఫ్లోరింగ్ కూడా లేనందున అంతా బురదమయంగా మారిపోతుంది. కౌన్సిల్ సమీపంలోనే పాన్ షాప్‌కు అనుమతించడం అక్కడ చెత్తా చెదారం, సిగరెట్ పీకలు తదితరాలు ఆ పరిసరాలను అధ్వాన్నంగా మారుస్తున్నాయి. గతంలో వర్షాకాలంలో నీరు లోపలికి వచ్చి ఫైళ్లు తడిచిపోయిన సందర్భాలున్నాయని అక్కడ పని చేసే సిబ్బంది చెబుతున్నారు. అందువల్ల ప్రధాన కార్యాలయంలోని భవన సముదాయాల్లో అనువైన భవనాన్ని కేటాయించాలని పలువురు డాక్టర్లు కోరుతున్నారు.