Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంట భూముల్లో హై టెన్షన్ కరెంట్ పోల్స్... నిర్బంధంలో మొగిలిచర్ల
- నోటీసులు ఇవ్వకుండానే పనులు
- ఆందోళనకు దిగిన రైతుల అరెస్ట్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/కాశిబుగ్గ
గ్రేటర్ వరంగల్లోని మొగిలిచర్లలో బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజాము నుంచే పోలీసులు మొగిలిచర్ల గ్రామాన్ని దిగ్బంధించారు. అసలు ఏం జరుగుతుందో తెలియని ప్రజలు మొదట ఆందోళనకు గురయ్యారు. చివరకు తమపంట పొలాల్లో హై టెన్షన్ కరెంటు పోల్స్ వేస్తున్నారని తెలుసుకుని ఆందోళనకు దిగారు. ఒకపక్క రైతులు ఆందోళన చేస్తుండగానే మరో పక్క గుత్తేదారులు పనులు ప్రారంభించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తమ భూముల్లో ఎలా పనులు చేస్తారని ప్రశ్నించారు. గుజరాత్లోని వడోదర నుంచి హైదరాబాద్ వరకు 888 కిలోమీటర్ల మేరకు 420 కెేవీ లైన్ను అమర్చే పనులు అదానీ కంపెనీ చేపట్టింది. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచర్ల గ్రామంలో నష్టపరిహారం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసిన నేపథ్యంలో ఈ పనులను రైతులు అడ్డుకుంటున్నారు. దాంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం ఉదయం 6.00 గంటలకు వెయ్యి మంది పోలీసులను రంగంలోకి దింపి మొగిలిచర్ల గ్రామాన్ని దిగ్బంధించారు. గ్రామంలోకి వచ్చే వారిని, వెళ్లే వారిని తనిఖీలు చేస్తూ పనులను అడ్డుకుంటున్న రైతులను అరెస్ట్ చేస్తామని భయాందోళనకు గురిచేశారు. కాగా, ఆందోళన చేస్తున్న 200 మంది రైతులతో పాటు సంఘీభావం తెలపడానికి వచ్చిన వరంగల్, హన్మకొండ డీసీసీి అధ్యక్షులు నాయిని రాజేందర్రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణను పోలీసులు అరెస్ట్ చేసి గీసుగొండ పోలీసు స్టేషన్కు తరలించారు.
తిమ్మంపేటలో గ్రిడ్ స్టేషన్ నిర్మాణం
జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తిమ్మంపేట గ్రామంలో 720 కేవీ గ్రిడ్ పవర్ స్టేషన్ను 105 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. మొగిలిచర్ల నుంచి వచ్చే 420 కేవీ లైన్ తిమ్మంపేట పవర్ గ్రిడ్ స్టేషన్కు విద్యుత్తును అందించనుంది. 2017లోనే తిమ్మంపేటలో పవర్ గ్రిడ్ స్టేషన్ పనులు ప్రారంభమైనా నేటికీ పూర్తి కాలేదు. మొగిలిచర్ల నుంచి ఒక లైన్ను దామెర మండలం ఒగ్లాపూర్లోని పవర్ గ్రిడ్ స్టేషన్కు అనుసంధానం చేస్తారు. వడోదర నుంచి వచ్చే 420 కేవీ లైన్ తిమ్మంపేట మీదుగా హైదరాబాద్ వరకు వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే తిమ్మంపేట నుంచి హైదరాబాద్-నాగర్కర్నూల్ వరకు ఎరెక్షన్ అయినట్టు సమాచారం. వైరింగ్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో మొగిలిచర్ల గ్రామంలో రైతులు ప్రతిఘటించడంతో కొంతకాలంగా పనులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఎదురుతిరిగిన రైతులను పోలీసు స్టేషన్కు తరలించి మరీ టవర్ల నిర్మాణం చేస్తున్నారు.
ధర్మారెడ్డి మోసం చేసిండు
అదానీ కంపెనీ చేస్తున్న పవర్ గ్రిడ్ పనుల్లో భాగంగా హైటెన్షన్ వైర్ల లైన్స్ వేయడానికి ల్యాండ్ పూలింగ్ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఎమ్మెల్యే ధర్మారెడ్డి అధ్వర్యంలో జరుగుతున్నదని, అతను నాశనమైపోతడని రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. తమకున్న ఎకరం, రెండెకరాల్లో టవర్ల నిర్మాణంతో 10 గుంటల భూమి పోతే మాకు మిగిలిదెంతంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. సర్కార్ మమ్మల్ని బలిపశువులను చేస్తుందని వాపోయారు. ఇప్పటి వరకు ఏ అధికారి ఇంత నష్టపరిహారం ఇస్తామని చెప్పలేదన్నారు. ఇక్కడ ఎకరం కోటి రూపాయలుందని, మా భూముల్లో టవర్లు వేస్తూ పోలీసులు మాపై దౌర్జన్యం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ టవర్ల నిర్మాణంతో మా భూములు బీడ్లుగా మారతాయంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డీవో దృష్టికి తీసుకుపోయినా మాకు న్యాయం జరుగలేదన్నారు.
కాంగ్రెస్ అండగా ఉంటుంది : డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి
గుత్తేదారులు కలెక్టర్ వద్ద పర్మిషన్ తీసుకుని పోలీసుల పహారాలో పనులు చేసుకోవడం దుర్మార్గమైన చర్య. రైతులను సమావేశపరిచి వారితో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలి. అంతవరకు పనులు నిలుపుదల చేయాలి. రైతులకు న్యాయం జరిగే వరకు వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.
భూముల విలువ తగ్గుతుంది : తిరుపతి, మొగిలిచర్ల రైతు
తమ భూమిలో నుంచి హై టెన్షన్ లైన్ పోవడం వల్ల భూముల విలువలు తగ్గుతాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల భూములను వారి ఇష్టపూర్వకంగానే తీసుకోవాలి కానీ నేడు జీవోకు విరుద్ధంగా దౌర్జన్యంగా సమాచారం ఇవ్వకుండానే భూముల్లో పనులు చేయడం దారుణం.
ధర్మారెడ్డికి రైతుల ఉసురు తగులుతుంది : కొండేటి రాజు, గొర్రెకుంట
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి రైతుల ఉసురు తగులుతుంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు, కాకతీయ టెక్స్టైల్ పార్క్ పేరుతో రైతుల నుంచి భూములు తీసుకున్న చల్లా ధర్మారెడ్డి మరోసారి రైతుల భూముల నుంచి హై టెన్షన్ లైన్లు వేయించడం దుర్మార్గం. ఇప్పటికే గొర్రెకుంట రెడ్డిపాలెం ప్రాంతంలో అనుమ తులు లేకుండా డాంబర్ ప్లాంట్ పెట్టి పంటపొలాలను నాశనం చేస్తున్నారు.