Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విడతలవారీగా కదిలిన కాంగ్రెస్ నేతలు
- అరెస్టు చేసి వేర్వేరు పోలీస్స్టేషన్లకు తరలింపు
- తోపులాటలో పలువురికి గాయాలు
- రేణుకాచౌదరిపై కేసు నమోదు
- దురుసుగా ప్రవర్తించిన పోలీసులు
- పోలీసుల తీరుపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ చేపట్టడాన్ని నిరసిస్తూ... టీపీసీసీ చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఖైరతాబాద్ చౌరస్తాలోని పీజేఆర్ విగ్రహం నుంచి రాజ్‌భవన్ ముట్డడికి వెళ్లాలని పిలుపునిచ్చింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు విడతలవారీగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఉదయం ఐదున్నర గంటలకు ఎన్ఎస్యూఐ నేతలు రాజ్‌భవన్ గేటు వద్ద భైఠాయించారు. ఆ తర్వాత గ్రూపులుగా ముట్టడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ముఖ్యనాయకులంతా రాజ్‌భవన్ వైపునకు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ చౌరస్తా వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ద్విచక్రవాహనాన్ని ఆందోళన కారులు తగులబెట్టారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. బస్సుపై ఎక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు రాజ్‌భవన్ మార్గంలోకి వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ పెద్దఎత్తున బారీకేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. వాటిని తోసుకొని కాంగ్రెస్ నేతలు దూసుకెళ్లారు. రేవంత్‌రెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు, నాయకులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రాజ్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు కార్యకర్తలు మరోమారు యత్నించడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. కాంగ్రెస్ నాయకులు చామల కిరణ్‌రెడ్డి, బల్లు రాథోడ్‌కు దెబ్బలు తగిలాయి. కొందరు కార్యకర్తలు సొమ్మసిల్లిపడిపోయారు. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాంగ్రెస్ మహిళా నేతలను మగపోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించారు. రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆమెను చుట్టుముట్టారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా ఆమె పోలీస్కాలర్ పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్య కంఠం నొక్కేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రేణుకా చౌదరిని పోలీసులు బలవంతంగా వాహనంలో తరలించారు. ఎస్ఐ కాలర్ పట్టుకున్నందుకు ఆమెపై కేసు నమోదు చేశారు. తనను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రేణుకా చౌదరి హెచ్చరించారు. డీసీపీ జోయల్ డేవిస్ కాలర్‌ను మరో కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క పట్టుకోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. చివరకు రాజ్ భవన్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, మహేశ్‌కుమార్, వీహెచ్, మహిళా అధ్యక్షులు సునీతారావు, కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ సుంకేట అన్వేష్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, యూత్‌కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, ఫిషర్మెన్ చైర్మెన్ మెట్టుసాయికుమార్,సుధీర్‌రెడ్డి తదితర నాయకులు రాజ్‌భవన్ వైపు వెళ్లారు. పోలీసులు అడ్డగించడంతో తీవ్ర వాగ్వాదం,తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో వారిని అరెస్టు చేసిన బొల్లారం, గోషామహల్, పంజాగుట్ట పోలీస్స్టేషన్లకు తరలించారు.
కాంగ్రెస్ నేతలపై పెట్టిన
అక్రమ కేసులను ఎత్తేయండి : రేవంత్
రాజ్‌భవన్ ముందు శాంతియుతంగా కార్యక్రమం నిర్వహించే క్రమంలో తమను పోలీసులు రెచ్చగొట్టారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కలంపోటుతో ఎత్తేస్తామని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని మగ పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేయడంతో ఆమె ఆగ్రహానికి గురయ్యారని తెలిపారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని చెప్పారు.
నాయకులకు, పోలీసుల తోపులాటలో గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పోలీసులు ఇలా వ్యవహరించి ఉంటే రాష్ట్రం వచ్చేదా? టీఆర్ఎస్ నేతలు...బీజేపీ అభ్యర్థిని రాష్ట్రపతిగా గెలిపించుకుంటే తప్పులేదనీ, మా జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే ఈడీ కేసులు నమోదు చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో నిరసన కార్యక్రమాలు జరిపినప్పటికీ ఒక్క చిన్న ఘటన కూడా జరగలేదన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీని ఈడీ విచారణకు నిరసనగా శుక్రవారం జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.