Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పట్టువీడని బాసరట్రిపుల్ ఐటీ విద్యార్థులు
- మూడోరోజూ కొనసాగిన ఆందోళన
- అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్
- విద్యాశాఖ మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం
- తాగునీరు, విద్యుత్ సరఫరా బంద్
- తల్లిదండ్రులు, సీపీఐ నారాయణ, ఎస్ఎఫ్ఐ నాయకుల అరెస్ట్
నవతెలంగాణ-నిర్మల్
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టువిడవ కుండా పోరాడుతున్నారు. సమస్యలను పరిష్కరించేవరకు వెనక్కి తగ్గేది లేదంటూ మూడో రోజు గురువారం కూడా ఆందోళన కొనసాగించారు. ఉదయం తాగునీరు, విద్యుత్ సరఫరా నిలిపేయడంతో విద్యార్థులు ప్రధాన గేటు వద్ద మీడియాతో మాట్లాడేందుకు ముందుకు రాగా.. పోలీసులు, ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో రెండో గేటు వద్ద బైటాయించారు. అదేవిధంగా విద్యార్థులను కలిసేందుకు వచ్చిన సీపీఐ జాతీయ సహాయ కార్యదర్శి నారాయణను, ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, బయట ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులను కూడా అరెస్టు చేశారు.
అకారణంగా అధికారులు, పోలీసులు తమను వేధిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నీటి సరఫరాను పునరుద్ధరించాలని, లేనట్టయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో ఉన్న ప్రధాన సమస్యలను తాము ప్రస్తావించామని విద్యార్థులు తెలిపారు. మూడ్రోజులుగా ఎండకు.. వానకు నెరవకుండా ఆందోళన చేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. యూనివర్సిటీకి ప్రభుత్వం నూతన డైరెక్టర్‌ను నియమించడంతో సంతోషం వ్యక్తం చేసినప్పటికీ.. డైరెక్టర్ నియామకంతో తమ సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. యూనివర్సిటీలో కొన్నేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వానికి విన్నవించినా పరిష్కరించకపోవడంతోనే ఆందోళన చేస్తున్నామన్నారు.
విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన సీపీఐ జాతీయ సహాయ కార్యదర్శి నారాయణను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీస్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యలు పట్టవా?. మూడ్రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ సతీష్‌కుమార్ నియామకం
ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్‌ను నియమించింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సతీష్‌కుమార్‌ను డైరెక్టర్‌గా నియమించింది. ఆయన గురువారం యూనివర్సిటీకి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు.
అరెస్టులకు భయపడేది లేదు : ఎస్ఎఫ్ఐ
ప్రభుత్వం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై స్పందించకపోవడం శోచనీయమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరవింద్ అన్నారు. ఆయన ట్రిపుల్ ఐటీ గోడ దూకి లోనికి వెళ్లి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. రెగ్యులర్ వైస్‌చాన్స్‌లర్‌ను నియమించాలని, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్స్ ఇవ్వాలని, తరగతి గదులకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. విద్యార్థుల సమస్యలు సిల్లీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనడం సరికాదన్నారు. పోలీసుల అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. అరవింద్‌తో పాటు ప్రధాన గేట్ వద్ద ఆందోళన చేయడానికి వచ్చిన ఎస్ఎఫ్ఐ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కపిల్, తెలంగాణ జనసమితి నాయకులను పోలీసులు అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.