Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ మూడు పార్టీల తీరు ఇదే...
ఒకరిపై మరొకరి పైచేయి కోసమే ఆరాటం
- బీజేపీ.. టీఆర్ఎస్.. కాంగ్రెస్‌ల తీరిది
- ఈ గలాటలో కీలక సమస్యలు పక్కకు
- ఇందుకు భిన్నంగా ప్రజల బాధల్ని భుజానికెత్తుకున్న వామపక్షాలు
- పెట్రో ధరలు, గ్యాస్ భారాలు..
- పోడు భూములపై పోరు దాకా ఇదే పంథా
బి.వి.యన్.పద్మరాజు
కేంద్రంలో రెండోసారి గద్దె మీద కూర్చున్న పార్టీ ఒకటి. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చి, ముచ్చటగా మూడోసారి పీఠం ఎక్కేందుకు ఉవ్విళ్లూరుతున్న పార్టీ మరోటి. పదేళ్లపాటు పవర్‌కు దూరంగా ఉన్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల్లోని లోపాలు, లొసుగులను ఆధారం చేసుకోవటం ద్వారా ఈసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించు కోజూస్తున్న పార్టీ మరోటి. ఆయా పార్టీలేవో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అవే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు. రాజకీయంగా రోజుకు రెండు, మూడు ప్రకటనలు గుప్పిస్తూ సంచనాలత్మకం కోసం పాకులాడుతున్న ఈ మూడు పార్టీలూ... రాష్ట్రంలోని ప్రజలెదుర్కొం టున్న ప్రధాన సమస్యలను, వారి ఈతి బాధలను పూర్తిగా గాలికొదిలేశాయి. పొలిటి కల్గా ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలనే ఏకైక అజెండాతో పూటకో ట్వీట్, రోజుకో స్టేట్మెంట్తో కాలం గడుపుతు న్నాయి. ప్రస్తుతం మారిన పరిణామాల దృష్ట్యా తమ ఇమేజ్ను పెంచుకునేందుకు 'రాజకీయ ఆందోళనలు, రాస్తారోకోలు, బంద్'లకు సిద్ధమవుతున్నాయి. అంతే తప్ప జనం గురించి ఏ కోశానా పట్టించుకున్న పాపాన పోవటం లేదు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఒకవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ పోతున్నది. వాటి ధరల నియంత్రణను పూర్తిగా మార్కెట్ శక్తులకు అప్పగించటం వల్ల ప్రజలపై విపరీతమైన భారాలు పడుతున్నాయి. బీజేపీ సర్కారు ప్రయివేటీకరణను శరవేగంగా అమలు చేస్తున్నది. దీంతో ప్రస్తుతమున్న రిజర్వేషన్లు మున్ముందు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. మరోవైపు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ సైతం తానేమీ తక్కువ కాదన్నట్టుగా సెస్‌లు, టోల్ రుసుముల పెంపు పేరిట పరోక్షంగా ఆర్టీసీ బస్ ఛార్జీలను ఇబ్బడి ముబ్బడిగా పెంచింది. ఇటీవల పెరిగిన కరెంటు ఛార్జీలు సైతం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవిగాక వాహన, భూ రిజిస్ట్రేషన్ల రుసుములు ఈ మధయ విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ ఉదాశీనత వల్ల ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. కూరగాయలు, పండ్లు మొదలు అన్ని నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలన్న సోయి అటు బీజేపీకిగానీ, ఇటు టీఆర్ఎస్కు గానీ లేకపోవటం గమనార్హం. సమస్యల నుంచి ప్రజలను మళ్లించటానికి వీలుగా బీజేపీ రాష్ట్ర నేతలు... మసీదులు, తవ్వకాలు, శివలింగాలు, సమాధులు, గుళ్లు, గోపురాల పేరిట నానా యాగీ చేస్తున్నారు. దీనికి అదనంగా ఆ పార్టీ ఢిల్లీ నేతలు ఇక్కడికొచ్చి 'తెలంగాణలో నిజాం రాజ్యాన్ని భూస్థాపితం చేస్తామనే' రెచ్చగొట్టుడు వ్యాఖ్యల ద్వారా అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. ఇదే సమయంలో పలు రాజకీయాంశాల్లో మోడీ సర్కార్‌పై పేపర్ పులిలా విరుచుకుపడుతున్న గులాబీ పెద్దలు... కీలకాంశాలపై మాత్రం పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నారు తప్ప నిర్దిష్ట కార్యాచరణకు పూనుకోవటం లేదన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం వీటిపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం ఆశ్చర్యకరమైన అంశం. ఇంతటి కీలకమైన ప్రజా సమస్యలపై పోరాడాలన్న ఆలోచన హస్తం పార్టీకి రాకపోవటమనేది వాటి పరిష్కారం పట్ల దాని చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పొచ్చు. అయితే ఇదే సమయంలో 'రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు...' ఇవ్వటాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో అనేకానేక ఆందోళనలకు ఆ పార్టీ పిలుపునివ్వటం గమనార్హం. ఆ క్రమంలో అది గురువారం 'చలో హైదరాబాద్' పేరిట హడావుడి సృష్టించిన సంగతి తెలిసిందే.
దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రధానంగా ఉన్నామని చెప్పుకుంటున్న ఆ మూడు పార్టీలూ... ఇలా ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్న తరుణంలో వామపక్షాలు వాటిని భుజానకెత్తుకున్నాయి.. ఇప్పుడు కూడా ఎత్తుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మొదలు విద్యుత్, బస్ ఛార్జీలపై అవి నికరంగా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. నిత్యావసర ధరల పెరుగుదలపై నిరసన గళమెత్తాయి. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇవ్వాలంటూ నినదిస్తున్నాయి. పోడు భూముల సమస్యను పరిష్కరించాలంటూ పట్టుబట్టాయి. తాజాగా వరంగల్ జిల్లా జక్కలొద్దిలో పేదల భూ పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్నాయి. గౌరవెల్లి నిర్వాసితుల పక్షాన నిలిచి పోరాడుతున్నాయి. ఇవేగాక రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక, విద్యార్థి, మహిళా ఉద్యమాలకు సంఘీభావం తెలుపుతున్నాయి. కుల దురహంకార, మతోన్మాద చర్యలను నిరసిస్తూ ముందుకెళుతున్నాయి. రాజ్యాంగాన్నీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ నిజమైన దేశ భక్తులం తామేనని నిరూపించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికైనా మిగతా పార్టీలు వీటిని చూసి నేర్చుకోవాలి. ప్రజా సమస్యలపై అవి దృష్టి సారించాలి.