Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎయిడ్స్ నియంత్రణ స్క్రీనింగ్ క్యాంప్‌తో తేలిందేంటి?
- నిధులు ఖర్చు చేసినా ఫలితమేది?
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పథకాలు ఒక లక్ష్యం కోసముంటాయి. వాటిని సరిగ్గా అమలు చేస్తే ఆ లక్ష్యం నెరవేరి ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. అలా కాదని నిధులు ఖర్చు చేసి నామమాత్రంగా అయిందనిపిస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి తయారవుతుంది. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ రెండు నెలల పాటు నిర్వహించిన శిబిరాలకు సంబంధించి అధికార వర్గాల్లో అలాంటి చర్చే జరుగుతున్నది. ఎయిడ్స్ రోగుల్లో వైరల్ హెపటైటీస్‌ను గుర్తించేందుకు ఉద్దేశించిన స్క్రీనింగ్ క్యాంప్‌తో వచ్చిన ఫలితమేముందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వైరల్ హెపటైటీస్ స్క్రీనింగ్ క్యాంప్ ఉద్ధేశం నీరు గారిందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (టిశాక్స్) చేపట్టిన ఈ స్క్రీనింగ్ ఎంత మందిలో హెపటైటీస్‌ను నిర్దారించారనే దానిపై లెక్కలు స్పష్టంగా లేవని విశ్వసనీయ సమాచారం. నిర్దారించిన వారిని సైతం గాలికి వదిలేశారని భావిస్తున్నారు. కేవలం నిధుల కోసమే అన్నట్టు నిర్వహించి ఇంత నిర్లక్ష్యంగా ఉండటానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పర్యవేక్షణ లోపమే కారణమని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ''వైరల్ హెపటైటీస్ స్క్రీనింగ్ క్యాంప్ ను హైరిస్క్ ప్రాంతాల్లో, ఎయిడ్స్ సోకిన వారికి నిర్వహించాలని ఎయిడ్స్ నియంత్రణ సంస్థకు చెందిన ఒక ఉన్నతాధికారి రాష్ట్ర వైద్యశాఖకు ప్రతిపాదించగా, అందుకు ఆ శాఖ అనుమతినిచ్చింది. హైదరాబాద్, మహబూబ్ నగర్‌తో పాటు మరో ఒకటి రెండు జిల్లాలో రెండు నెలల పాటు 'స్క్రీనింగ్ క్యాంప్' నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్ నిమిత్తం రూ.40 నుంచి రూ.50 లక్షల నిధులను కూడా విడుదల చేసినట్టు విశ్వసనీయ సమాచారం. 'స్క్రీనింగ్ క్యాంప్' నిర్వహించేందుకు తాత్కాలిక పద్ధతిన డాటా మేనేజర్, ల్యాబ్‌టెక్నీషియన్ సిబ్బందిని నియమించారు. హైరిస్క్ ప్రాంతాలతో పాటు, ఎయిడ్స్ సోకిన మొత్తం ఎనిమిది వేల మందికి పరీక్షలు నిర్వహించారు. కాగా, ఇందులో సుమారు 150 నుంచి 200 వరకు హెపటైటీస్ కేసులు ఉన్నట్టు గుర్తించారు. పాజిటివ్ సోకిన వారిలో వైరల్ కౌంట్ గుర్తించేందుకు తక్షణమే ఉస్మానియా ఆస్పత్రిలో పరీక్ష చేయించాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా చికిత్సను ప్రారంభించాలి. ఈ చికిత్సకు సంబంధించి కొన్ని మందులను కూడా పలు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచారు. కానీ, ఆ సొసైటీలోని సదరు ఉన్నతాధికారి మాత్రం కేవలం స్క్రీనింగ్ క్యాంప్‌కే పరిమితం అయినట్టు తెలిసింది. పాజిటివ్ గుర్తించిన వారి నివేదికను కూడా వైద్య ఆరోగ్యశాఖకు పంపించలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారిలో వ్యాధి స్థాయిని గుర్తించి చికిత్స చేపట్టాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఆ ప్రక్రియను చేపట్టలేదు. దీంతో పాజిటివ్ సోకిన వారి పరిస్థితి ఏమిటనీ, వారిలో వ్యాధి తీవ్రత పెరిగితే ప్రమాదకరమని ఎయిడ్స్ నియంత్రణ సంస్థలోని కొందరు వాపోతున్నారు. లక్షలు ఖర్చు చేసి చేపట్టిన ఈ శిబిరంలో ఎంత మంది పాజిటివ్ ఉన్నారనే అంశాన్ని వైద్యారోగ్య శాఖ కూడా పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. కేవలం నిధుల కోసమే ''వైరల్ హెపటైటీస్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించినట్టు విమర్శలున్నాయి. డాటా మేనేజర్లు, ల్యాబ్ టెక్నీషియన్లకు సక్రమంగా వేతనాలు కూడా ఇవ్వలేదనీ, వారికి సెలవుల వేతనాలను కూడా కట్ చేశారనీ, ప్రాజెక్ట్ నుంచి మాత్రం పూర్తి స్థాయి వేతనాలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.