Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతులకు నాణ్యమైన విత్తనాలివ్వాలి
- కౌలు రైతులకు రుణార్హత కార్డులివ్వాలి:
- రైతు సంఘం నిరసనలో పోతినేని, టి.సాగర్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి.సాగర్ డిమాండ్ చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందేలా చూడాలని కోరారు. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సాగుభూమిలో 30 శాతానికిపైగా కౌలు రైతులే పంటలు పండిస్తున్నారనీ, వారికి 2011 చట్టం ప్రకారం రుణార్హత కార్డులివ్వడంతోపాటు పథకాలన్నీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటున్న రైతులలో సగానికిపైగా కౌలు రైతులే ఉన్నారని వివరించారు. వానాకాలం సాగుకు సరైన ప్రణాళిక రూపొందించి దానిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువగా మద్దతు ధర నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏయే పంటలను ఎంత రేటు పెట్టి కొంటుందో స్పష్టత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో నాసిరకం విత్తనాల బెడద కొనసాగుతూనే ఉందనీ, ఇప్పటికే 80 వేల క్వింటాళ్ల పత్తి విత్తనాలు పట్టుకున్నారని వివరించారు. నాసిరకం విత్తనాలు వేసి నష్టపోయిన రైతులకు వ్యవసాయ శాఖ పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అవుతుందనే ఆశతో రైతులు రెన్యూవల్ చేసుకోకపోవడం వల్ల బ్యాంకుల్లో డిపాల్టర్లుగా మారారని తెలిపారు. రూ.20వేల కోట్ల వరకు ప్రయివేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు రుణాలు తెచ్చుకుంటున్నారని వివరించారు. ధరణి పోర్టల్లోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 58 ఏండ్లు నిండిన రైతులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలన్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు సాగుదారులకు హక్కు పత్రాలివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఎం.శోభన్, వెల్లకెల బాలకృష్ణ, డి. బాల్రెడ్డి, గఫూర్, రాష్ట్ర కమిటీ సభ్యులు బొంతు రాంబాబు, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఎ రాములు, మాటూరు బాల్రాజ్ గౌడ్, లక్ష్మయ్య, సత్తిరెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, జీఎస్ గోపి, పాల్గొన్నారు.