Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మన ఊరు-మనబడి'పై స్థానికుల మండిపాటు
నవతెలంగాణ-సంగెం /మట్టెవాడ
బడి గంట మోగిందని విద్యార్థిని సంబరపడింది. మూడు రోజుల నుంచి చలాకీగా స్నేహితులతో కలిసి పాఠశాలకు వెళ్లింది. రోజు మాదిరిగానే గురువారం పాఠశాలలో స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బాలిక విద్యుత్తీగలకు తగిలి మృతిచెందింది. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం తిమ్మాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. వివరాల్లోకెళ్తే... తిమ్మాపూర్ గ్రామానికి చెందిన లింగాల రాజేశ్వరి(11) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది. సాయంత్రం నాలుగంటల సమయంలో పాఠశాలలో తోటి విద్యార్థులతో కలిసి ఆడుకుంటోంది. కాగా పాఠశాలలోని ఓగది వద్ద నిర్లక్ష్యంగా ఉన్న జేవైర్కు విద్యుత్ సరఫరా కావడంతో ప్రమాదవశాత్తు బాలిక తగిలి విద్యుద్ఘాతానికి గురైంది. గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. మూడు రోజుల కింద పాఠశాలలో బాలిక చేరగా అంతలోనే మృతి చెందడంతో తిమ్మాపురం గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది.
నిర్లక్ష్యమెవరిది?
తిమ్మాపూర్ ప్రభుత్వ పాఠశాలలో బాలిక మృతితో 'మన ఊరు- మనబడి' పై గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. విద్యార్థిని మరణంతో ప్రభుత్వ పాఠశాలలో డొల్లతనం బట్టబయలైందని ఆరోపిస్తున్నారు. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యుద్ఘాతానికి గుర్వడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామన్న పాలకుల మాటలు నీటి మూటలేనని బాలిక మృతి ఘటనతో తేటతెల్లమైంది. పాఠశాలలు ఈనెల 13వ తేదీన ప్రారంభమైన తొలి రోజుల్లోనే విద్యార్థి మృతి చర్చకు దారితీస్తోంది. పాఠశాల గదిలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ తీగలు ఉండగా ప్రారంభానికి ముందే ఎందుకు సరిచేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.